
అమరావతి, 15 మార్చి (హి.స.)
, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ పౌర సహాయక సేవ వ్యవస్థ ‘మన మిత్ర’ వాట్సప్ నంబర్ 9552300009 ద్వారా ఆరోగ్య సేవలు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఈ నంబర్కు వాట్సప్లో ‘హాయ్’ అని మెసేజ్ చేస్తే చాలు.. పొందాల్సిన ఆరోగ్య సేవల మెనూ తెరుచుకుంటుంది. అందులో ‘ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీ అపాయింట్మెంట్ సేవలు (ఓఆర్ఎస్)’ను ఎంచుకుంటే.. జిల్లా, ఆసుపత్రి, విభాగం, తదితర ఆప్షన్లు కన్పిస్తాయి. ఆధార్తో అనుసంధానమైన మొబైల్ నంబర్ నమోదు చేయగానే ఓటీపీ వస్తుంది. దాని ద్వారా లాగిన్ కావాలి. మీ పూర్తి పేరు, పుట్టిన తేదీ, ఈ-మెయిల్, చిరునామా, పిన్ కోడ్, జిల్లా, రాష్ట్రం వివరాలు సమర్పించాలి. అంతే, టోకెన్ నంబర్ జనరేట్ అవుతుంది. చివరి నాలుగు నంబర్లు నమోదు చేస్తే.. అపాయింట్మెంట్ బుక్ అవుతుంది. దాని ఆధారంగా కేటాయించిన సమయంలో ఆసుపత్రికి వెళ్లి వైద్యసేవలు పొందొచ్చు. సాధారణంగా అయితే, రోగి లేదా రోగి బంధువు ఆసుపత్రికి వెళ్లి ఓపీ టోకెన్ కోసం వరుసలో నిల్చోవాలి. వైద్యులను సంప్రదించాక మందుల కోసం మరోసారి క్యూలైన్లో నిల్చోవాలి. పైగా వెళ్లిన రోజు ఆ స్పెషలిస్ట్ వైద్యుల అందుబాటు, మందుల లభ్యతపై సరైన సమాచారం లేకపోతే ఆసుపత్రికి వెళ్లినా, పని కాకపోవచ్చు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ