
ఖమ్మం, 15 మార్చి (హి.స.)
ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని స్థిర
ఆదాయాన్ని ఇచ్చే పంటల వైపు దృష్టి మరల్చాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకు విజ్ఞప్తి చేశారు. ఖమ్మం జిల్లా కొనిజర్ల మండల పరిధిలోని అంజనాపురం గ్రామం వద్ద గోద్రెజ్ కంపెనీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పామాయిల్ ఫ్యాక్టరీ పనులను ఆదివారం మంత్రి సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంట మార్పిడి చేయకపోతే వ్యవసాయానికి భవిష్యత్తు లేదన్నారు. ఆయిల్ ఫామ్ కు మంచి భవిష్యత్తు ఉందని సబ్సిడీ కింద రైతులకు ప్రభుత్వం రూ.51లు చెల్లిస్తుంది అన్నారు. అధిక యూరియా వినియోగం క్యాన్సర్ కు ఆహ్వానం అని పేర్కొన్నారు.
క్యాన్సర్ వ్యాధిలో దేశంలోనే పంజాబ్ ప్రథమ స్థానంలో ఉందన్నారు. పామ్ ఆయిల్ తక్కువ పెట్టుబడితో చీడపీడలు ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని రైతుకు ఆదాయాన్ని సమకూరుస్తుందన్నారు. ఎక్కడో ఫ్యాక్టరీ ఉంటే తమకు ఉపయోగం లేదని తమ రాష్ట్రంలో ఫ్యాక్టరీ ఉంటే తమ రైతుల రెక్కల కష్టం తమ రాష్ట్రానికి దక్కుతుందన్నారు. ఫ్యాక్టరీ నిర్మాణాన్ని పూర్తిచేసి మే మొదటి వారంలో ప్రారంభానికి సిద్ధం చేయాలని గోద్రెజ్ కంపెనీ యజమాన్యానికి సూచించారు. కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు రామదాస్ నాయక్ అదనపు జిల్లా కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, తహశీల్దార్ ఎన్ అరుణ ట్రాన్స్కో డీఈ రమేష్ వైరా హార్టికల్చర్ ఆఫీసర్ వేణు తదితరులు పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు