
నాగర్ కర్నూల్, 15 మార్చి (హి.స.)
2027 జనాభా లెక్కలు దేశాభివృద్ధి
ప్రణాళికలకు కీలకమని జిల్లాలో జనగణన విధులను అధికారులు సమర్థంగా నిర్వహించాలని నాగర్ కర్నూల్ కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు. జనగణన ద్వారా సేకరించే సమాచారంతో భవిష్యత్తులో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాల అమలుకు స్పష్టమైన ప్రణాళికలు రూపొందించేందుకు వీలు ఉంటుందని తెలిపారు. 2027 జనగణన పురస్కరించుకుని జనాభా లెక్కల సేకరణలో భాగస్వాములు అయ్యే తహసీల్దార్లు, మండల విద్యాధికారులు, మండల స్థాయి సెన్సస్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, డిటిలు, అన్ని శాఖల జిల్లా అధికారులకు ఆదివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ప్రధాన సమావేశ మందిరంలో జిల్లా ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి తొలి విడత శిక్షణా కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 2011లో చివరిసారిగా దేశంలో జనాభా గణన జరిగిందని, వాస్తవానికి 2021లో ఈ ప్రక్రియ చేపట్టాల్సి ఉన్నప్పటికీ కరోనా ప్రభావం కారణంగా వాయిదా పడిందన్నారు. ప్రస్తుతం తొలిసారిగా సాంకేతికతను వినియోగిస్తూ డిజిటల్ విధానంలో జనాభా లెక్కల సేకరణ చేపట్టేందుకు ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మొదటి దశలో నివాస గృహాలు, వివిధ రకాల కట్టడాలు, కుటుంబ వివరాలు సేకరిస్తారని, రెండో విడతలో వ్యక్తిగత వివరాలు నమోదు చేస్తారని చెప్పారు. దేశంలోనే తొలిసారిగా పూర్తిగా డిజిటల్ విధానంలో జనగణన నిర్వహించనున్నందున ప్రతి ఒక్కరు సహకరించి వాస్తవ వివరాలు అందించాలని సూచించారు. ప్రజలు అందించే సమాచారం ఎక్కడా బయటకు వెల్లడి కాకుండా నేరుగా సర్వర్లో భద్రపరచే విధంగా సాంకేతికతను వినియోగిస్తున్నామని తెలిపారు. సెల్ఫ్ డిక్లరేషన్ విధానం ఎంతో ముఖ్యమని, అధికారులు, ఎన్యుమరేటర్లు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
చార్జ్ ఆఫీసర్లు ప్రతిరోజూ గణన ప్రక్రియను సమీక్షించాలని, తాము కూడా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేస్తామని తెలిపారు. అందుబాటులో ఉన్న సిబ్బందితో నిర్దేశిత గడువులోపు జనాభా లెక్కల సేకరణ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. మొదటి దశలో నిర్వహించే ఇండ్ల జాబితా, గృహాల గణనలో ఇంటి నిర్మాణం, ఇంటి పరిస్థితి, కుటుంబ యజమాని వివరాలు, తాగునీటి సౌకర్యం, మురుగు నీటి పారుదల వ్యవస్థ, మరుగుదొడ్ల లభ్యత, వంటగది సౌకర్యం వంటి వివరాలతో పాటు రేడియో, టెలివిజన్, స్మార్ట్ ఫోన్, కంప్యూటర్, సైకిల్, కారు వంటి గృహ సౌకర్యాలపై మొత్తం 33 ప్రశ్నలకు సంబంధించిన వివరాలను ఎన్యుమరేటర్లు ప్రతి ఇంటికి వెళ్లి సేకరిస్తారని కలెక్టర్ తెలిపారు. అధికారులు మూడు రోజుల శిక్షణా తరగతులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అమరేందర్, జిల్లా పరిషత్ దేవసహాయం, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి సుజాత, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు