రేపటినుండి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..
హైదరాబాద్, 15 మార్చి (హి.స.) రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రేపు ప్రారంభం కానున్నాయి. నెలాఖరు దాకా ఈ సెషన్ జరిగే అవకాశాలు ఉన్నాయి. మొదటి రోజు గవర్నర్ ప్రసంగంతో సభ షురూ కానుంది. ఈనెల 20న ఆర్థికశాఖ మంత్రి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాష్ట్ర
Assembly


హైదరాబాద్, 15 మార్చి (హి.స.)

రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రేపు ప్రారంభం కానున్నాయి. నెలాఖరు దాకా ఈ సెషన్ జరిగే అవకాశాలు ఉన్నాయి. మొదటి రోజు గవర్నర్ ప్రసంగంతో సభ షురూ కానుంది. ఈనెల 20న ఆర్థికశాఖ మంత్రి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాష్ట్ర బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. కాగా, ఈ దఫాలో అనేక అంశాలపైన ప్రతిపక్షాలు సంధించే ప్రశ్నలు, ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న అనేక వివాదాస్పద అంశాలపైనా ప్రజలకు స్పష్టత ఇచ్చేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతున్నది. తాజాగా, ఇరాన్ తో ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం కారణంగా తలెత్తిన అనేక సమస్యల్లో ప్రధానంగా వంటగ్యాస్, పెట్రోల్ వంటి అంశాలు తీవ్రంగా ఉన్నాయి. వీటిపై ఇప్పటికే ప్రభుత్వం స్పష్టత ఇస్తున్నది. అయితే అసెంబ్లీలో ప్రతిపక్షాల ప్రశ్నలు, సర్కారు విధానాన్ని ప్రజలకు తెలిపేలా సభలో కాంగ్రెస్ సభ్యులు మాట్లాడతారని పార్టీవర్గాలు చెబుతున్నాయి.

ఇటీవల గోదావరి జలాల అంశంపై కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటలయుద్ధం చోటుచేసుకున్నది. ఏపీ ప్రభుత్వం గోదావరి నదీపైన చేపడుతున్న ప్రాజెక్టులపైన ప్రభుత్వం, అధికారపార్టీ తరఫున వివరణ ఇవ్వనున్నట్టు తెలిసింది. గతంలో అసెంబ్లీలో కృష్ణా నదీజలాలపై పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ఇచ్చారు. గోదావరి జలాలపైన మరింత స్పష్టత కోసం సభలో చర్చించే అవకాశాలు ఉన్నాయి. ఇక సింగరేణిలో నైనీకోల్ బ్లాక్ అంశంపై ఇటీవల వివాదం చెలరేగి రాజకీయ దుమారానికి దారితీసింది. దీంతో గనుల టెండర్లపై అవినీతి ఆరోపణలు తదితర అంశాలు అసెంబ్లీలో చర్చకొచ్చే అవకాశాలు ఉన్నాయి.దీనిపైనా తమ ఎమ్మెల్యేలు సమాధానాలు ఇచ్చేలా మాట్లాడతారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.

మూసీ ప్రక్షాళన, సరోవర్ ప్రాజెక్టు వంటి అంశాలు కూడా ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో అధికార, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీల మధ్య పొలిటికల్ వార్ నడుస్తున్నది. దీనిపైనా సభలో చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలిసింది. ఖమ్మంలో భూదాన్ భూముల అంశం సైతం హాట్ టాపిక్ గా మారింది. ఇది కూడా అసెంబ్లీలో చర్చకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీనిపైనా విపక్షాల ఆరోపణలు, విమర్శలకు కౌంటర్ ఇచ్చేందుకు తమ సభ్యులు ప్రిపేరవుతున్నారని అధికారపార్టీ వర్గాలు తెలిపాయి. అసెంబ్లీ సమావేశాల్లో చర్చకు వచ్చే అన్ని అంశాలపైనా ధీటుగా మాట్లాడేందుకు, ఆయా అంశాలపైనా ప్రజల్లో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేసేలా కాంగ్రెస్ నుంచి స్పష్టతను ఇచ్చే ప్రసంగాలు ఉంటాయని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. డిప్యూటీ స్పీకర్ ఎన్నిక లేనట్టే? అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా డోర్నకల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాంచందర్ నాయక్ పేరును పార్టీ అధిష్టానం గతేడాది జూన్ లో ప్రకటించింది. ఆయన ప్రస్తుతం విప్ గా కొనసాగుతున్నారు. రాంచందర్ నాయక్ పేరు ఖరారైనా అధికారికంగా ఉపసభాపతి ఎన్నిక ప్రక్రియ చేపట్టాల్సి ఉంది. అయితే ప్రతి సమావేశంలోనూ ఈ నియామకానికి బ్రేక్ లు పడుతూ వస్తోంది. కాగా, ఈ బడ్జెట్ సమావేశాల్లోనూ డిప్యూటీ స్పీకర్ ఎన్నికపైనా స్పష్టత లేదు. డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు ముందు నోటిఫికేషన్ ఇచ్చి ఎలక్షన్ జరిపించాల్సి ఉంటుంది. గత అసెంబ్లీ సమావేశాల్లో సమయం లేకపోవడంతో ఎన్నికను నిర్వహించలేదని ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. అయితే రాంచందర్ నాయక్ సైతం మంత్రివర్గ విస్తరణ జరిగితే తనకు మంత్రిపదవి ఇవ్వాలని అధిష్టానాన్ని కోరుతున్నట్టు సమాచారం. దీనితో డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జాప్యానికి అది కూడా ఓ కారణమన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో ఉంది. మంత్రివర్గ విస్తరణపైనా ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ లేకపోవడంతో ఈ సమవేశాల్లో డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఉండొచ్చనే ఉహాగానాలు వినిపిస్తున్నాయి. డిప్యూటీ స్పీకర్ ఎన్నికపై బీఆర్ఎస్ సైతం విమర్శలు ఎక్కుపెడుతున్నది.

అసెంబ్లీలోని ప్రివిలేజ్ కమిటీకి డిప్యూటీ స్పీకరే చైర్మన్గా వ్యవహరిస్తారని, ఆ పదవి ఖాళీగా ఉండటం సరికాదని బీఆర్ఎస్ నేతలు గతంలో విమర్శలు గుప్పించారు. ఈ పరంపరలో అధికార కాంగ్రెస్ మదిలో ఏమున్నదో తెలియాల్సి ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande