
హైదరాబాద్, 15 మార్చి (హి.స.)
ఇంట్లో పని మనుషులుగా చేరి,
నమ్మించి, యజమానులు ఊరు వెళ్ళటంతో ఇంటిలో 2 కోట్ల రూపాయల విలువైన ఆభరణాలను చోరికి పాల్పడిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్-25లోని ప్లాట్ నెం.305లో పింగళి అనిరుధ్ రెడ్డి అనే వ్యాపారి, భార్య దీపికారెడ్డితో కలిసి ఉంటున్నాడు. నగరంలోని పేరు మోసిన హోటల్ యజమాని కుమార్తె అయిన దీపికారెడ్డి దంపతులు శుక్రవారం మధ్యాహ్నం ఇంటికి తాళాలు వేసి విమానంలో ఊటీకి వెళ్లారు. 45 రోజుల క్రితమే ఈ ఇంట్లో నేపాల్కు చెందిన మహేష్ షాయి(30), అప్సర(25) దంపతులు పనిమనుషులుగా చేరారు. యజమాని వద్ద నమ్మకంగా పనిచేస్తున్నట్లు నటించారు. పక్కా పథకంతో ఇంట్లో చేరిన నేపాలీ దంపతులు అవకాశం కోసం ఎదురు చూశారు. నాలుగైదు రోజుల నుంచి ఇంట్లోకి ఎలా వెళ్లాలి.. నగలు, నగదు ఎక్కడ భద్రపరిచారు.. వంటి వాటి పై రెక్కీ నిర్వహించారు.
యజమానులు అనిరుధ్ రెడ్డి, దీపికారెడ్డి ఊటికి వెళ్లడంతో శుక్రవారం రాత్రి 12.30 గంటల సమయంలో కత్తులు, కటార్లు, రాడ్ల సహాయంతో నేపాలీ దంపతులు ప్రధాన ద్వారం తాళం పగులగొట్టారు. బెడ్రూమ్లోకి వెళ్లి అల్మారాను, లాకర్లను శనివారం తెల్లవారుజామున 4.30 గంటల వరకు పగులగొట్టారు. 8 డైమండ్ నెక్లెస్లు, 10 రోలెక్స్ వాచీలు, బంగారు నగను బ్యాగ్లో సర్దుకుని ఉడాయించారు. ఉదయం ఇంటికి వచ్చిన డ్రైవర్ గమనించి యజమానికి సమాచారం ఇచ్చాడు. అనంతరం పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. వేలిముద్రలు తీసుకున్నారు. ఈ దంపతులను పనిలో కుదిర్చిన పాత పనిమనుషులు హరత్సింగ్, రీమాసింగ్ల కోసం గాలిస్తున్నారు. అక్కడ ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. బాధితులు పేరు మోసిన కుటుంబానికి చెందినది కావడంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. శనివారం సాయంత్రం నేపాల్ సరిహద్దులకు ముంబై, బిహార్లకు పోలీసు బృందాలు చేరుకుని నిఘా పెట్టాయి. 8 డైమండ్ నెక్లెస్లు, బంగారు ఆభరణాలు, 10 రోలెక్స్ వాచీలు ధర దాదాపు 2 కోట్ల వరకు ఉండొచ్చని పోలీసులు తెలిపారు. ఈ ఘటన పై పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు