తెలుగు రాష్ట్రాలను ముంచెత్తనున్న భారీ వర్షాలు
అమరావతి, 15 మార్చి (హి.స.) మార్చ్ మొదటి వారం నుంచే సూర్యుడు తన ప్రతాపం చూపించగా అల్లాడి పోయిన రెండు తెలుగు రాష్ట్రాలకు బిగ్ రిలీఫ్ కలగనుంది. భారత వాతావరణశాఖ(IMD) అధికారుల అంచనా ప్రకారం.. నేటి నుంచి ఐదు రోజులపాటు ఇరు తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు
Rain


అమరావతి, 15 మార్చి (హి.స.)

మార్చ్ మొదటి వారం నుంచే సూర్యుడు తన ప్రతాపం చూపించగా అల్లాడి పోయిన రెండు తెలుగు రాష్ట్రాలకు బిగ్ రిలీఫ్ కలగనుంది. భారత వాతావరణశాఖ(IMD) అధికారుల అంచనా ప్రకారం.. నేటి నుంచి ఐదు రోజులపాటు ఇరు తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు, వడగళ్ళు, పిడుగులు ముంచెత్తనున్నాయి. ముఖ్యంగా మార్చి 15 నుంచి 17 వరకు తెలంగాణలోని హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో సుమారు 40-50 మి.మీ మేర భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ సమయంలో కేవలం వర్షమే కాకుండా, సెకనుకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే బలమైన గాలులు, భీకరమైన ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వానలు (Hails) ప్రజలను బెంబేలెత్తించనున్నట్టు సమాచారం. ముఖ్యంగా మధ్యాహ్నం నుంచి అర్థరాత్రి వరకు ఈ వర్షాల ప్రభావం అత్యంత తీవ్రంగా ఉంటుందని అంచనా.

అయితే అసలైన ముప్పు మార్చి 18 నుంచి 20 వరకు ఉండనుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ మూడు రోజులు వాతావరణం అత్యంత ప్రచండంగా మారి, రాష్ట్రంలో 60 నుంచి 80 మి.మీ వరకు కుంభవృష్టి కురిసే అవకాశం ఉంది. ఈ సమయంలో గాలి వేగం గంటకు 60 కిలోమీటర్ల వరకు చేరవచ్చునని, దీనివల్ల విద్యుత్ స్తంభాలు నేలకూలడం, భారీ హోర్డింగ్లు పడిపోవడం వంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ముఖ్యంగా ఈ అకాల వర్షాలు రైతన్నల నడ్డి విరిచేలా కనిపిస్తున్నాయి; కోతకు సిద్ధంగా ఉన్న పంటలు వడగళ్ల వానలకు దెబ్బతినే ప్రమాదం ఉంది. పిడుగుల బారిన పడి ప్రాణనష్టం జరిగే అవకాశం ఉన్నందున, ఉరుముల సమయంలో ఎవరూ చెట్ల కింద లేదా బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని ప్రభుత్వం సూచిస్తోంది.

అలాగే హైదరాబాద్లో మార్చి 18, 19 తేదీల్లో మధ్యాహ్నం నుంచి తెల్లవారుజాము వరకు ఎడతెరిపి లేని భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నందున, ట్రాఫిక్ ఇబ్బందులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే ముప్పు ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. రైతులు పంటలను కాపాడుకోవాలని, లోతట్టు ప్రాంతాల వారు జాగ్రత్తగా ఉండాలని, అవసరం అయితే తప్ప ఇళ్లనుంచి బయటికి రావొద్దని సూచిస్తున్నారు. అటు ఏపీలోనూ పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురవనుండగా.. వడగళ్ళు, పిడుగులు పడే అవకాశం ఉందని IMD సూచించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande