
అమలాపురం, 16 మార్చి (హి.స.)గల్ఫ్లో యుద్ధ ప్రభావం జిల్లాలో హోటళ్లు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లు, టిఫిన్ సెంటర్లు, టీ స్టాల్స్పై తీవ్ర ప్రభావం చూపుతోంది. వాణిజ్య సిలిండర్ల సరఫరా నిలిచి పోవడంతో వ్యాపారం డీలా పడింది. వీధుల్లో అల్పాహారం విక్రయించేవారు సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొంత మంది పూట గడవడం కోసం నల్ల బజారులో అధిక ధరలు వెచ్చించి ఏరోజుకారోజు నెట్టుకొస్తున్నారు.
కష్టాలతో పాటు మినపగుళ్లు, వంట నూనె, శనగలు, వంటి నిత్యవసరాల ధరలు సైతం పెరిగాయి. చిన్నచిన్న హోటళ్లు, వీధుల్లో బండ్లపై విక్రయించే వారు ధరలు పెంచారు. ఇడ్లీ, దోశ, పూరీ వంటి టిఫిన్ల ధరలు రూ.10 నుంచి రూ.15 వరకు పెంచి విక్రయిస్తున్నారు. గతంలో రూ.20కు నాలుగు సమోసాలు విక్రయించేవారు. ప్రస్తుతం 3 మాత్రమే ఇస్తున్నారు. గతంలో భోజనంలో నాలుగు రకాల కూరలు వడ్డించేవారు. ప్రస్తుతం వాటిని రెండుకు పరిమితం చేశారు.
గ్యాస్ కొరత నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న సామిల్లులు(కర్రలు కోసే మిల్లులు) వద్ద కలప ముక్కలకు డిమాండ్ పెరిగింది. గతంలో మిల్లుల వద్ద వృథాగా పడి ఉన్న రద్దును ఎంతో కొంత ఇచ్చి తీసుకువెళ్లమనే వారు. ప్రస్తుతం క్వింటాళ్ల లెక్కన విక్రయిస్తున్నారు. కలపను బట్టి క్వింటా రూ.700 నుంచి రూ.900 వరకు వసూలు చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ