
అమరావతి, 16 మార్చి (హి.స.)
శాంతిపురం, : మండల పరిధి ఎంకేపురానికి చెందిన నవాజ్ (19) దారుణ హత్యకు గురైన ఘటన ఆదివారం వెలుగు చూసింది. పోలీసుల వివరాల మేరకు.. చికెన్ దుకాణం నిర్వహిస్తున్న ఖాదర్బాషా, మగ్బూల్బీకి ఇద్దరు కుమారులు. రెండో కుమారుడు నవాజ్ శాంతిపురంలో మోటారు వెల్డింగ్ దుకాణంలో పని చేస్తున్నాడు. శనివారం రాత్రి 11 గంటలకు ఫోన్ రావడంతో ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. ఆదివారం ఉదయం ఎంకేపురం- శాంతిపురం రహదారి పక్కన మామిడి తోటలో యువకుడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు తెలియజేశారు. డీఎస్పీ పార్థసారథి, గ్రామీణ సీఐ మల్లేష్ యాదవ్, రాళ్లబూదుగూరు ఎస్సై నరేష్, ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నవాజ్ తల, శరీరంపై గాయాలు గుర్తించారు. ప్రాథమిక విచారణ మేరకు హత్య కేసుగా నమోదు చేశారు. పోలీస్ జాగిలం, క్లూస్టీం ఆధ్వర్యంలో పరిశీలించారు. మామిడి తోట నుంచి వెళ్లిన జాగిలం ఎంకేపురం సమీపంలోని శివాలయం వద్ద ఆగి తిరుగుముఖం పట్టింది.
నవాజ్ హత్యకు కారణాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. గ్రామానికి చెందిన బంధువర్గమే హత్య చేసి ఉంటుందని అనుమానిస్తున్నారు. యువకుడికి, స్థానిక యువతి మధ్యనున్న ప్రేమ వ్యవహారం హత్యకు దారితీసి ఉండొచ్చని భావిస్తున్నారు. యువతి సంబంధీకులు, నవాజ్ శనివారం రాత్రి ఘర్షణ పడినట్లు కొందరు చెబుతున్నారు. ఈ క్రమంలోనే హత్య జరిగి ఉండొచ్చని అంటున్నారు. ఈ నేపథ్యంలో ముగ్గురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ