
హైదరాబాద్, 17 మార్చి (హి.స.)
*
*
రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్‌లో భాగంగా రైతులకు ఫార్మర్ కిట్‌ల పంపిణీ కార్యక్రమాన్ని గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు ఈరోజు సచివాలయంలో ప్రారంభించారు.
ఈ రోజు నిర్వహించిన “రైతునేస్తం” కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా రైతు వేదికల ద్వారా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులతో మంత్రి రైతులతో నేరుగా ముచ్చటించారు వారి అనుభవాలను మరియు సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
మంత్రిగారు మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం రంగంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి వ్యవసాయానికి పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని రైతులు ఈ విధానాన్ని అవలంబించాలని సూచించారు.
రూ42 కోట్లతో ఈ పథకాన్ని అమలుచేస్తున్నట్లు, దానిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 489 క్లస్టర్లు దాదాపు 61,125 ఎకరాలలో ఈ సంవత్సరం ప్రకృతి వ్యవసాయం సాగు విధానంలోకి తీసుకువచ్చే విధంగా ప్రణాళికా చేయడం జరిగిందని అందుకు గాను 61,125 మంది రైతులను ఎంపిక చేసి రైతు వేదికలల్లో శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నదని తెలియజేసారు. అంతే గాక వీరికి సాగులో మరియు మార్కెటింగ్ లో తోడ్పడే విధంగా కృషిసఖి లను క్లస్టర్ కు ఇద్దరు చొప్పన నెలకి 5000 గౌరవ వేతనం ఇచ్చి నియమించడం జరిగిందని తెలిపారు.
ప్రకృతి వ్యవసాయానికి అవసరమైన బీజామృతం, జీవామృతం, దశపర్ణి వంటి జీవ ఉత్పాదకాలు స్వయంగా తయారు చేసుకోలేని రైతుల కోసం ప్రభుత్వం BRC లను (జీవ ఉత్పాదక తయారీ కేంద్రాలు) ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని, ప్రతి BRCకి ఇందుకు రూ లక్ష కేటాయించినట్లు తెలిపారు.
ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని నర్మెట్టలో రైతు మహోత్సవాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ మహోత్సవంలో వ్యవసాయ, పశుసంవర్ధక మరియు అనుబంధ సంస్థల ఆధ్వర్యంలో రైతులకు ఉపయోగపడే దాదాపు 150 ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
ఈ నెల 22న నర్మెట్టలో ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మొదటి విడుత రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రూ. 20,600/- కోట్ల రైతు రుణమాఫీ ఒకే దఫాలో విడుదల చేసిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు.అంతేగాక గతంలో ఎన్నడూ లేని విధంగా ఖరీఫ్ లో 9 రోజులలో 9000/- కోట్లు రైతు ఖాతాలలో జమ చేసిన ఘనత ఈ ప్రభుత్వానిది అని అన్నారు.
రైతు మహోత్సవానికి రాష్ట్రం నలుమూలల నుంచి రైతులు భారీ ఎత్తున హాజరుకావాలని పిలుపునిస్తూ, ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.
ఈ దిశగా AEOలు, ఆదర్శ రైతులు, శాస్త్రవేత్తలు సమన్వయంతో పనిచేసి రైతులకు అవసరమైన మార్గదర్శకాలు అందించాలని సూచించారు.
అదేవిధంగా నూనె గింజలు, పప్పుదినుసులు, చిరుధాన్యాల సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
ఆయిల్ పామ్ సాగు రైతులకు స్థిరమైన ఆదాయం అందించడంలో సహకరిస్తుందని, ప్రకృతి విపత్తులు, పక్షులు, జంతువుల వల్ల కలిగే నష్టాలు తక్కువగా ఉంటాయని మంత్రి వివరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు