
హైదరాబాద్, 17 మార్చి (హి.స.)
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి
జీవన్ రెడ్డి (Jeevan Reddy) జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ (Sanjay Kumar)పై మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లడుతూ.. తనతో కలిసి పనిచేయాలంటూ సంజయ్ చేసిన వ్యాఖ్యలను జీవన్ రెడ్డి తప్పుబట్టారు. అసలు సంజయ్ ఏ పార్టీలో ఉన్నారో స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తనతో కలిసి పనిచేయాలని సంజయ్ నాకు ఆఫర్ ఇవ్వడం ఏంటని మండిపడ్డారు. అసలు ఆయనది ఏ పార్టీ అని.. స్పీకర్ ఏమో ఆయన బీఆర్ఎస్ లో ఉన్నారని అంటున్నారని కామెంట్ చేశారు. సంజయ్ ఏమో కాంగ్రెస్లో కలిసి పనిచేద్దాం అంటున్నారని, అసలు నాకు ఆఫర్ ఇవ్వడానికి అసలు సంజయ్ ఎవరని ప్రశ్నించారు. తాను పార్టీ మారాలని ఆలోచించేందుకు కారణం ఎమ్మెల్యే సంజయ్ అని తెలిపారు. తాను ఇంకా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నట్లు స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీతో తనది 40 ఏళ్ల బంధం ఉందని, ఎంత ఒత్తిడి ఉంటే పార్టీ మార్పుపై ఆలోచిస్తున్నానో అర్థం చేసుకోవాలని జీవన్ రెడ్డి అన్నారు.
కాంగ్రెస్ (Congress) పార్టీలోకి సంజయ్ రావడం వల్లే జిల్లాలో చిచ్చు రేగిందని జీవన్ రెడ్డి ఆరోపించారు. తాను పార్టీ వీడతానని ఎప్పుడూ చెప్పలేదని, అసలు అటువంటి ఆలోచన రావడానికి కారణమే సంజయ్ అని మండిపడ్డారు. 2014లో ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తాను ప్రజల హక్కుల కోసం పోరాడానని గుర్తు చేశారు. కానీ, ప్రస్తుత ఎమ్మెల్యే సంజయ్ ప్రజల అభివృద్ధి హక్కును సాధించలేకపోతున్నారని విమర్శించారు. వక్రమార్గాన వెళ్తే ప్రజలు ఎన్నటికీ హర్షించరని హితవు పలికారు. ఒక పార్టీ గుర్తుపై గెలిచి, మరో పార్టీలో ఉంటూ సీనియర్ నేతలకు ఆఫర్లు ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. జగిత్యాల కాంగ్రెస్లో పాత, కొత్త నేతల మధ్య పొసగడం లేదని ఈ వ్యాఖ్యల ద్వారా మరోసారి స్పష్టమైంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..