
కోల్కతా, ఢిల్లీ, 17,మార్చి (హి.స.) : శాసనసభ ఎన్నికల షెడ్యూలు వెలువడిన కొన్ని గంటల్లోనే పశ్చిమబెంగాల్లో కీలక అధికారులకు ఒకేసారి స్థానచలనం తప్పలేదు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నందినీ చక్రవర్తిపై వేటువేసి ఆమెను ఎన్నికల సంబంధిత విధుల నుంచి పూర్తిగా దూరం పెట్టాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఆమె స్థానంలో 1993 బ్యాచ్ ఐఏఎస్ అధికారి, అదనపు ప్రధాన కార్యదర్శి దుష్యంత్ నరియాలాను సీఎస్గా నియమించింది. దీంతోపాటు రాష్ట్ర డీజీపీ పీయూష్ పాండేను తొలగించి 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి సిధ్నాథ్ గుప్తాను, హోంశాఖ కార్యదర్శి జగదీశ్ ప్రసాద్ మీనా స్థానంలో సంఘమిత్ర ఘోష్ని నియమించింది. కోల్కతా పోలీసు కమిషనర్ (సీపీ) సుప్రతీమ్ సర్కార్ను తొలగించి అజయ్కుమార్ నంద్ను నియమించింది. పాండేను డైరెక్టర్ (సెక్యూరిటీ)గా, సర్కార్ను సీఐడీ అదనపు డీజీగా నియమించింది.
ఇవన్నీ తక్షణం జరగాలని ఆదివారం రాత్రి పొద్దుపోయాక ఆదేశాలు జారీచేసింది. ఈ పరిణామాలు రాజకీయ, అధికారవర్గాల్లో కలకలం రేకెత్తించాయి. బెంగాల్ చరిత్రలో ఇంతభారీగా కుదుపు చోటుచేసుకోవడం ఇదే తొలిసారి. ఎన్నికల సన్నద్ధత సమీక్ష అనంతరం ఈసీ ఈ నిర్ణయాలు వెల్లడించింది. వీరెవరికీ ఈ ఎన్నికల సంబంధిత విధుల్లో భాగం కల్పించరాదని స్పష్టంచేసింది. తమ ఆదేశాలు తక్షణమే అమలు చేయాలని, అది జరిగిందో లేదో సోమవారం మధ్యాహ్నంలోగా నివేదిక సమర్పించాలని ఆదేశించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ