
ఢిల్లీ, 17,మార్చి (హి.స.) ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లో పాకిస్థాన్ జరిపిన వైమానిక దాడులు పెను మారణకాండకు దారితీశాయి. కాబూల్లోని ఒమిద్ అడిక్షన్ ట్రీట్మెంట్ హాస్పిటల్ లక్ష్యంగా జరిగిన ఈ దాడిలో సుమారు 400 మంది పౌరులు ప్రాణాలు కోల్పోగా, మరో 250 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ అమానుష ఘటనపై భారతదేశం తీవ్రస్థాయిలో మండిపడింది. ఈ దాడిని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. ఇస్లామాబాద్ చర్యలను తప్పుబడుతూ విడుదల చేసిన ప్రకటనలో ఇది అత్యంత అమానుషమైన, పిరికిపంద చర్య అని అభివర్ణించింది. వైద్య సేవలు అందించే ఆసుపత్రిని సైనిక లక్ష్యంగా ఎంచుకోవడం ఏమాత్రం సమర్థించలేని విషయం. అమాయక పౌరులను బలితీసుకోవడం పాకిస్థాన్ క్రూరత్వానికి నిదర్శనం” అని భారత్ తెలిపింది. ఒక మారణకాండను సైనిక చర్యగా చిత్రీకరించేందుకు పాకిస్థాన్ ప్రయత్నిస్తోందని, కానీ ఇది ముమ్మాటికీ హేయమైన దురాక్రమణ అని భారత్ స్పష్టం చేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ