
ఢిల్లీ, 17,మార్చి (హి.స.) : ఇజ్రాయెల్-అమెరికా, ఇరాన్ల మధ్య దాడులు, ప్రతిదాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో భారత్ నుంచి ఇప్పటివరకు 5,500కు పైగా విమానాలు రద్దయినట్లు పౌర విమానయానశాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు సోమవారం రాజ్యసభలో వెల్లడించారు. ఇందులో భారత విమానయాన సంస్థలకు చెందిన 4,335, విదేశీ సంస్థలకు చెందిన 1,187 విమానాలు ఉన్నాయని తెలిపారు. ‘‘ప్రస్తుత సంక్షోభ సమయంలో విమానయాన కార్యకలాపాల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాం. పౌర విమానయానశాఖ, డీజీసీఏలు పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాయి. అవకాశం లభించినప్పుడల్లా విమానాలు నడుపుతున్నాం. ఇలా ఇప్పటివరకు దాదాపు 2.19 లక్షల మందిని భారత్కు చేరవేశాం. ఇప్పటికీ కొన్ని గగనతలాలు మూసే ఉన్నాయి. అవి అందుబాటులోకి వచ్చి, సురక్షిత పరిస్థితులు ఏర్పడినప్పుడే విమానాల రాకపోకలు సాధారణ స్థితికి చేరుకోగలవు’’ అని ఓ ప్రశ్నకు కేంద్రమంత్రి సమాధానం ఇచ్చారు. గతేడాది డిసెంబరులో ఇండిగో విమానాలు పెద్దసంఖ్యలో రద్దయిన వ్యవహారంపై స్పందిస్తూ.. ప్రయాణికులకు ట్రావెల్ కూపన్ల రూపంలో రూ.163.92 కోట్ల మేర పరిహారం ఇప్పటికే అందినట్లు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ