
హైదరాబాద్, 17 మార్చి (హి.స.)
తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ (TCUR) పరిధిలోని ప్రాపర్టీ ట్యాక్స్ బకాయిలు పేరుకుపోయాయి. జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ పరిధిలో 28,80,260 ప్రాపర్టీ ట్యాక్స్ నంబర్స్ (పీటీఎన్స్) ఉన్నాయి. వీటి ద్వారా రూ.14,930 కోట్లు రావాల్సి ఉంది. పాత బకాయిలు రూ.4,197.81 కోట్లు ఉన్నాయి. ఈ బకాయిలపై వడ్డీనే రూ.7,862.22 కోట్లు కాగా ప్రస్తుతం చెల్లించాల్సిన ట్యాక్స్ రూ.2,763.18 కోట్లు, దీనిపై వడ్డీ రూ.107 కోట్లు ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ పరిధిలో పాతబకాయిలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు చెందిన బకాయిలను తీసేస్తే రావాల్సింది రూ.8,734 కోట్లు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అయితే రూ.2,762 కోట్లు వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు అధికారుల నివేదకలో వెల్లడించారు. ఇప్పటి వరకు రూ.2,186 కోట్లు మాత్రమే వసూలైంది.
పాత బకాయిదారులను ప్రోత్సహించేందుకు 90 శాతం వడ్డీ మాఫీ ఇస్తున్నా, నగరవాసులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. క్యూర్ పరిధిలో 2,67,153 అసెస్మెంట్ల నుంచి రూ.322కోట్లు వచ్చింది. వీరికి వడ్డీ మాఫీ కింద రూ.52 కోట్లు బెనిఫిట్ అయిందని అధికారులు చెబుతున్నారు.
బల్దియా నివేదిక ప్రకారం.. మొత్తం ఆస్తి పన్ను డిమాండ్ రూ.5,230 కోట్లుగా ఉంది. ఇందులో పాత బకాయిలపై వడ్డీ మాఫీ (90 శాతం) కింద రూ. 2,495 కోట్లు మినహాయిస్తే నెట్ డిమాండ్ రూ.2,735 కోట్లు కావాలి. కానీ, అధికారుల నివేదికలో రూ.2,985 కోట్లుగా చూపించారు. అధికారుల తప్పుడు లెక్కలతో రూ.250 కోట్లు తేడా కనిపిస్తోంది. దీంతోపాటు జీహెచ్ఎంసీ పరిధిలో 11.45 లక్షల అసెస్మెంట్లు ఉండగా, ఇప్పటి వరకు పన్ను కట్టిన వారు 6.31 లక్షల మంది మాత్రమే. ఇంకా 5.13 లక్షల మంది పన్ను కట్టాల్సి ఉంది. ఈ నెల 15 నాటికి ఓటీఎస్ కింద పన్ను కట్టిన వారు కేవలం 1.11 లక్షల మంది మాత్రమే ఉండటం గమనార్హం. దీని ద్వారా వచ్చిన ఆదాయం కేవలం రూ.140 కోట్లు మాత్రమే.
ఆస్తి పన్ను వడ్డీపై 90 శాతం రాయితీతో చెల్లించేందుకు ఇదే చివరి అవకాశమని, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన వెల్లడించారు. ఈ నెల 31 వరకు ఈ అవకాశం ఉంటుందన్నారు. క్యూర్ ఏరియాలో 28.80 లక్షల పన్నుదారుల్లో 16.80 లక్షల మంది చెల్లించారని చెప్పారు. ఏప్రిల్ 1 నుంచి మూడు కమిషనరేట్ల పరిధిలో బకాయిదారులపై ప్రత్యేక ఫోకస్ ఉంటుందన్నారు. ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ రెవెన్యూ అదనపు కమిషనర్ ప్రియాంక అల, శానిటేషన్ అదనపు కమిషనర్ రవి కిరణ్ ఉన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..