
హైదరాబాద్, 17 మార్చి (హి.స.)
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల
సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ఆయన సభలో మాట్లాడుతూ.. తొలి అసెంబ్లీ ప్రసంగంలో గవర్నర్ గారు ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించామని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. రాహుల్ గాంధీ కూడా తొలి కేబినెట్ సమావేశంలోనే వీటికి చట్టపరమైన గ్యారంటీ ఇస్తామని హామీ ఇచ్చారని వ్యాఖ్యానించారు. కానీ రెండున్నర ఏళ్లు గడుస్తున్నా ఒక్క గ్యారంటీకి కూడా చట్టబద్ధత కల్పించలేదని కేటీఆర్ నిలదీశారు.
సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన వెంటనే తొలి సంతకం చేసినట్లు చెప్పిన ఆరు గ్యారంటీల ఫైలు ఇప్పుడు ఎక్కడ ఉందో ఎవరికీ తెలియడం లేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఇటీవల ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (FSL)లో జరిగిన అగ్నిప్రమాదంలో ఆ ఫైలు కూడా కాలిపోయిందా అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మాయమైన ఆ ఆరు గ్యారంటీల ఫైలును వెతికి పట్టుకోవడానికి ప్రభుత్వం ఒక ప్రత్యేక విచారణ బృందాన్ని (SIT) ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికొదిలేసి, ప్రభుత్వం ఇతర అంశాలపై దృష్టి పెడుతోందని విమర్శించారు. కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టేందుకు, ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ అసెంబ్లీలో బీఆర్ఎస్ తరపున 'ప్రైవేట్ మెంబర్ బిల్' ప్రవేశపెడతామని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా మాట నిలబెట్టుకోవాలని, రైతులకు, మహిళలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
నేనే రాజు.. నేనే మంత్రి అని మిడిసిపడ్డ వారు సంపదను మూటగట్టుకు పోలేరని కేటీఆర్ అన్నారు. నాడు శిబి చక్రవర్తి అడిగిన కోరికలు తీర్చి, ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్నారని గుర్తు చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటేనే పాలకులకు విశ్వసనీయత ఉంటుందని అన్నారు. ఎవరూ వెయ్యేళ్లు ఉండరని, పదవిలో ఎవరూ శాశ్వతం కాదని పేర్కొన్నారు. శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి విలువ, విశ్వసనీయత ఉండాలని కోరారు. గవర్నర్ ప్రసంగంలో ప్రభుత్వ ప్రాధాన్యతలు, ఆలోచనలు ప్రతిబింబించాలని, కానీ నిన్నటి ప్రసంగంలో అవేవీ లేవని కేటీఆర్ ఎద్దేవా చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు