
హైదరాబాద్, 17 మార్చి (హి.స.)
కరీంనగర్ పోలీస్ కమిషనర్ (CP)
వ్యవహారశైలిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (MLA Koushik Reddy) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇవాళ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ... పోలీసు ఉన్నతాధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, ఆయనకు జల్సాలు ఎక్కువయ్యాయని అన్నారు. ప్రైవేట్ వ్యక్తులకు ఆయుధాలు ఇచ్చి కాల్పులు జరిపిస్తున్నారని ఆరోపించారు. సెప్టెంబర్ 2025లో కరీంనగర్ ఫైరింగ్ రేంజ్లో సీపీ సతీమణి, ఆమె ఐదుగురు మిత్రులతో కలిసి 10 రౌండ్లు కాల్పులు జరిపారని కౌశిక్ రెడ్డి ఆరోపించారు. ఏకే-47, పిస్టల్స్తో సుమారు 160 బుల్లెట్లను ప్రైవేట్ వ్యక్తులు ఎలా వాడతారని ఆయన ప్రశ్నించారు. బోనాలపల్లిలో అమృతమ్మ అనే వృద్ధురాలికి బుల్లెట్ తగిలిందని, కానీ ఆమె రాయి తగిలిందని భావించిందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని కప్పిపుచ్చడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.
హోం మంత్రిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy).. మీ శాఖలో ఏం జరుగుతుందో తెలుసా అంటూ కౌశిక్ రెడ్డి నిలదీశారు. ప్రైవేట్ వ్యక్తులు ఫైరింగ్ చేయడంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తాను నేను చెప్పింది తప్పని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు. మరి ఇప్పుడు ఐపీఎస్ అసోసియేషన్ ఎందుకు స్పందించడం లేదని కామెంట్ చేశారు. వికాస్ అగర్వాల్ (Vikas Agarwal) అనే అధికారి ప్రైవేట్ వ్యక్తికి ఇన్నోవా వాహనం ఇచ్చి పంపారని, ఇలా కొందరు అధికారుల వల్ల మొత్తం వ్యవస్థకు చెడ్డపేరు వస్తుందని విమర్శించారు. సీపీ.. నన్ను బెదిరించలేడని, తాను భయపడే వ్యక్తిని కాదన్నారు. ఆయనకు ఇంటెలిజెన్స్ ఉంటే, మాకు లక్షలాది మంది కార్యకర్తలు సమాచారం ఇస్తారంటూ కౌశిక్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు