
హైదరాబాద్, 17 మార్చి (హి.స.)
రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం
సృష్టించిన మొయినాబాద్ డ్రగ్స్ కేసులో తెలంగాణ ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసు మూలాలను, అంతర్జాతీయ సంబంధాలను ఛేదించేందుకు ప్రభుత్వం ప్రత్యేక విచారణ బృందాన్ని (SIT Special Investigation Team) ఏర్పాటు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. రాజేంద్రనగర్ డీసీపీ యోగేశ్ గౌతమ్ నేతృత్వంలో ఈ సిట్ తన విచారణను ప్రారంభించనుంది. ఈ బృందం మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో జరిగిన పార్టీకి సంబంధించి లోతైన విచారణ జరగనుంది. ఆ పార్టీకి ఎవరెవరు హాజరయ్యారు..? అక్కడ డ్రగ్స్ సరఫరా ఎలా జరిగింది..? అనే కోణంలో విచారణ కొనసాగుతుంది.
ఈ డ్రగ్స్ దందాతో దుబాయ్్కు ఉన్న సంబంధాలపై సిట్ ఆరా తీయనుంది. అంతర్జాతీయ డ్రగ్స్ మాఫియాతో నిందితులకు ఉన్న పరిచయాలను వెలికితీయనున్నారు. అదేవిధంగా కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న నమిత్ శర్మ రియల్ ఎస్టేట్ వ్యాపారాల ద్వారా డ్రగ్స్ మనీని ఎలా మళ్లించారనే అంశంపై సిట్ ఫోకస్ చేయనుంది. అక్రమ సంపాదనకు సంబంధించి ఆర్థిక లావాదేవీలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. అధికారిక ఉత్తర్వుల విడుదలతో సిట్ అధికారులు త్వరలోనే నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారించే అవకాశం ఉంది. ఈ కేసులో మరికొంతమంది రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..