డిజిటల్ యుగంలో ఫ్యాక్ట్ చెకింగ్ కీలకం.. సంగారెడ్డి జిల్లా కలెక్టర్
సంగారెడ్డి, 17 మార్చి (హి.స.) ప్రస్తుత డిజిటల్ యుగంలో తప్పుడు సమాచారం వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ఫ్యాక్ట్ చెకింగ్కు అత్యంత ప్రాధాన్యం పెరిగిందని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. కృత్రిమ మేధస్సు ద్వారా తయారవుతున్న కంటెంట్, తప్పుదా
సంగారెడ్డి కలెక్టర్


సంగారెడ్డి, 17 మార్చి (హి.స.) ప్రస్తుత డిజిటల్ యుగంలో తప్పుడు

సమాచారం వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ఫ్యాక్ట్ చెకింగ్కు అత్యంత ప్రాధాన్యం పెరిగిందని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. కృత్రిమ మేధస్సు ద్వారా తయారవుతున్న కంటెంట్, తప్పుదారి పట్టించే చిత్రాలు, తప్పుడు సమాచారాన్ని గుర్తించి నిజమైన వార్తలను ప్రజలకు చేరవేయడంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమని ఆమె అన్నారు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో హైదరాబాద్ ఆధ్వర్యంలో మంగళవారం సంగారెడ్డి జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో వార్తలాప్ (VARTALAP) పేరుతో జర్నలిస్టులకు ఒకరోజు వర్క్షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లింగ ఆధారిత హింస, మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, జర్నలిజంలో కృత్రిమ మేధస్సు వినియోగం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, పీఐబీ అదనపు డైరెక్టర్ జనరల్ శ్రుతి పాటిల్తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి వర్క్షాప్ను ప్రారంభించారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాకు చెందిన సుమారు 130 మంది జర్నలిస్టులు ఈ వర్క్షాప్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ, డిజిటల్ యుగంలో ఫ్యాక్ట్ చెకింగ్కు అత్యంత ప్రాధాన్యం పెరిగిందన్నారు. చిన్న తప్పుదారి పట్టించే సమాచారం కూడా సమాజంలో భయం, ప్రజల నమ్మకంపై ప్రతికూల ప్రభావం చూపవచ్చని పేర్కొన్నారు. మీడియా ప్రజాస్వామ్యానికి నాలుగో స్థంభంలాంటిదని పేర్కొన్నారు. ప్రభుత్వ పాలసీలు,పథకాలు మరియు సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడంలో జర్నలిస్టుల పాత్ర కీలకమని ఆమె అన్నారు. జర్నలిస్టులు నైతిక విలువలతో కూడిన నాణ్యమైన వార్తలను అందించాలని సూచించారు. ఈ తరహా వర్క్షాప్లు జర్నలిస్టులు నూతన పరిజ్ఞానాన్ని తమ వృత్తిపరమైన సామర్థ్యాన్ని తెలుసుకుని పెంపొందించుకోవడానికి ఉపయోగపడతాయని కలెక్టర్ తెలిపారు.

వార్తలాప్ వర్క్ షాప్ జర్నలిస్టులకు ఎంతో ఫీల్ కీలకమని పీఐబీ అదనపు డైరెక్టర్ జనరల్ శ్రుతి పాటిల్ అన్నారు. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖల అధికారిక సమాచారాన్ని ప్రజలకు ఖచ్చితంగా చేరవేయడంలో పీఐబీ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. ముఖ్యంగా కృత్రిమ మేధస్సు విస్తరిస్తున్న ఈ కాలంలో తప్పుడు వార్తలను గుర్తించి ఖండించడంలో పీఐబీ ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ముఖ్యమైన బాధ్యత నిర్వర్తిస్తున్నదని తెలిపారు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ద్వారా నిర్వహిస్తున్న పలు కార్యక్రమాల గురించి ఆమె వివరించారు. లింగ సమానత్వం, మహిళల సంక్షేమ పథకాలపై సీనియర్ జర్నలిస్టు సజయ కాకర్ల మాట్లాడుతూ, లింగ సమానత్వం కుటుంబం నుంచే ప్రారంభం కావాలని, పిల్లల్లో సరైన దృక్పథాన్ని తల్లిదండ్రులు పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ అంశాలపై అవగాహన కల్పించడంలో జర్నలిస్టుల పాత్ర కూడా కీలకమని చెప్పారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande