
హైదరాబాద్, 17 మార్చి (హి.స.)
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలపై బీఆర్ఎస్ (BRS) పార్టీ గళమెత్తింది. రాష్ట్రంలో వేల సంఖ్యలో ఉన్న రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) నేతృత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సెక్రటరీకి వాయిదా తీర్మానం (Adjournment Motion) అందజేశారు. పెండింగ్లో ఉన్న రిటైర్మెంట్ బెనిఫిట్స్, గ్రాట్యుటీ, జీపీఎఫ్ (GPF) బకాయిలను ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చెల్లించాలని బీఆర్ఎస్ నేతలు తీర్మానంలో పేర్కొన్నారు.
పదవీ విరమణ చేసిన తర్వాత రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలు అందక రిటైర్డ్ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారి కుటుంబాలు గడవడమే కష్టంగా మారిందని హరీశ్ రావు పేర్కొన్నారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనే రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని, ప్రభుత్వం దీనిపై స్పష్టమైన ప్రకటన చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. అసెంబ్లీ లోపల, బయట రిటైర్డ్ ఉద్యోగుల హక్కుల కోసం బీఆర్ఎస్ తన పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు