మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి షోకాజ్ నోటీసు ఇచ్చిన బిఆర్ఎస్
హైదరాబాద్, 17 మార్చి (హి.స.) మొయినాబాద్ డ్రగ్స్ కేసు వ్యవహారంలో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి భారత్ రాష్ట్ర సమితి (BRS) పార్టీ షాక్ ఇచ్చింది. డ్రగ్స్ వినియోగం జరిగినట్లు వస్తున్న ఆరోపణల నేపథ్యంలో పార్టీ క్రమశిక్షణ కమిటీ ఆయనకు షోకాజ్ నోటీస
MLA Rohit Reddy


హైదరాబాద్, 17 మార్చి (హి.స.)

మొయినాబాద్ డ్రగ్స్ కేసు వ్యవహారంలో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి భారత్ రాష్ట్ర సమితి (BRS) పార్టీ షాక్ ఇచ్చింది. డ్రగ్స్ వినియోగం జరిగినట్లు వస్తున్న ఆరోపణల నేపథ్యంలో పార్టీ క్రమశిక్షణ కమిటీ ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరిగిన ఒక సమావేశంలో మాదకద్రవ్యాల వినియోగం జరిగిందని, ఆ సమయంలో రోహిత్ రెడ్డి అక్కడ హాజరై ఉన్నారనే మీడియా కథనాలను పార్టీ తీవ్రంగా పరిగణించింది. ఈ మొత్తం పరిణామాలపై 7 రోజుల్లోపు లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని పార్టీ ఆదేశించింది. ఇలాంటి అక్రమ కార్యకలాపాలతో సంబంధం కలిగి ఉండటం పార్టీ విలువలకు, ప్రతిష్టకు విరుద్ధమని పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ నోటీసు జారీ చేసినట్లు ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్ పేర్కొన్నారు.

తాజా పరిస్థితుల నేపథ్యంలో పార్టీ తుది నిర్ణయం తీసుకునే వరకు రోహిత్ రెడ్డి పార్టీ కార్యక్రమాలకు, అధికారిక సమావేశాలకు దూరంగా ఉండాలని స్పష్టం చేసింది. గడువులోపు సంతృప్తికరమైన వివరణ ఇవ్వని పక్షంలో, ఎలాంటి ముందస్తు నోటీసు లేకుండానే పార్టీ రాజ్యాంగం ప్రకారం క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ప్రభుత్వం ఇప్పటికే ఈ కేసుపై 'సిట్' (SIT) ఏర్పాటు చేసిన తరుణంలో సొంత పార్టీ కూడా రోహిత్ రెడ్డిపై చర్యలకు తీసుకోవడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande