
మంగళగిరి 18 మార్చి (హి.స.):అక్షయపాత్ర ఫౌండేషన్ గొప్ప మైలురాయిని చేరుకుంది. పాతికేళ్ల ప్రస్థానంలో దేశవ్యాప్తంగా పాఠశాలల విద్యార్థులకు 500 కోట్ల భోజనాలు అందించి చరిత్రలో నిలిచిపోయే ఘనత సాధించింది. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పీఎం పోషణ్ (మధ్యాహ్న భోజనం) పథకంలో భాగంగా మంగళవారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్షయపాత్ర సేవలను వారు ప్రశంసించారు. రాష్ట్రపతి ముర్ము విద్యార్థులకు స్వయంగా భోజనం తినిపించి, బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో అక్షయపాత్ర ఫౌండేషన్ తరఫున సంస్థ చైర్మన్ మధు పండిత్ దాస, వైస్ చైర్మన్ చంచలపతి దాస, ఏపీ సెంట్రల్ రీజినల్ ప్రెసిడెంట్ వంశీధర దాస పాల్గొన్నారు. 2024, ఏప్రిల్ 2న న్యూయార్క్లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో 400 కోట్ల భోజనాలు మైలురాయి కార్యక్రమం వేడుకగా జరిగిందని, ఇప్పుడు 500 కోట్ల భోజనాల వేడుక ఢిల్లీలో రాష్ట్రపతి సమక్షంలో జరగడం సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ