
బాపట్ల , 18 మార్చి (హి.స.)
పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావంతో గ్యాస్ కొరత రోజురోజుకు తీవ్రమవుతోంది. హోటళ్లు, మెస్లు, రెస్టారెంట్లకు గ్యాస్ ఏజెన్సీలు వాణిజ్య సిలిండర్లు సరఫరా చేయడం లేదు. జిల్లా కేంద్రంలో ఇప్పటికే 30 శాతం అల్పాహారశాలలు మూతపడగా.. మెస్సుల్లో ఒక్కపూటే వంట చేస్తున్నారు. మరోవైపు నల్లబజారులో గృహ వినియోగ సిలిండర్ను రూ.2 వేలకు విక్రయిస్తున్నారు. వీటిని అడ్డుకోవడంలో పౌరసరఫరాల శాఖ అధికారులు విఫలమవుతున్నారు. క్యాటరింగ్ నిర్వాహకులకు సిలిండర్లు లభించక శుభకార్యాల మెనూలో వడ్డించే వంటకాల రకాలు తగ్గిస్తున్నారు.
అధికారుల ఆదేశాలతో గ్యాస్ ఏజెన్సీలు వాణిజ్య సిలిండర్లను సంక్షేమ వసతిగృహాలు, ఆసుపత్రులకు మాత్రమే కేటాయిస్తున్నాయి. బాపట్ల, చీరాలలో హోటళ్లు, రెస్టారెôట్లు, మెస్లలో రోజుకు సగటున ఐదారు వాణిజ్య సిలిండర్లు వినియోగిస్తారు. వారం రోజులుగా వీటి సరఫరా నిలిపివేయడంతో కొందరు బయట కట్టెల పొయ్యిపై వంట చేయించి హోటళ్లకు తెచ్చి విక్రయిస్తున్నారు. కొందరు హోటళ్లను మూయలేక బయట గృహ అవసరాల సిలిండర్ను రూ.2 వేలకు కొంటున్నారు. ఇప్పటికే అల్పాహారం, కూరలు, భోజనం ధరలు రూ.పది నుంచి రూ.20 వరకు పెరిగాయి.
జిల్లాలోని తీర ప్రాంతంలో మూడు నక్షత్రాల హోటళ్లు, రిసార్టులు పదుల సంఖ్యలో ఉన్నాయి. రెసార్టెంట్లు గ్యాస్ కొరత ఎదుర్కొంటున్నాయి. ఇప్పటికే పర్యాటకులకు వడ్డించే మెనూలో వంటకాలకు కోత విధించాయి. హైదరాబాద్ ఇతర దూర ప్రాంతాల నుంచి వస్తున్న పర్యాటకులు రుచులకు దూరమవుతున్నారు. పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వచ్చే పర్యాటకుల సంఖ్య తగ్గిపోతోంది.
గ్యాస్ సిలిండర్లు నల్లబజారుకు తరలిపోకుండా నిఘా పెంచాలని, విస్తృతంగా దాడులు చేసి రెండు, మూడు రెట్లు అధిక ధరలకు విక్రయించకుండా చర్యలు చేపట్టాలని పౌర సరఫరాలు, రెవెన్యూ శాఖల అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. జిల్లాలో అధికారులు తూతూమంత్రంగా తనిఖీలు చేసి చేతులు దులిపేసుకున్నారు. రోజూ నల్లబజారులో గ్యాస్ సిలిండర్ల విక్రయాలు జరుగుతున్నా చర్యలు శూన్యం.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ