
భీమవరం, 18 మార్చి (హి.స.) తాడేపల్లిగూడెం పురపాలక మున్సిపల్ సర్వేయర్ రౌతు రామకృష్ణ రూ.50 వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (అనిశా) అధికారులకు చిక్కారు. పట్టణంలోని భూపాల్నగర్లోని భూపాల్ లెజెండ్ అపార్ట్మెంట్లో మొదటి అంతస్తులో ఆయన ఉంటున్న నివాసంలో మంగళవారం దాడులు చేసి రెడ్హ్యాండెడ్గా పట్టుకుని నగదును స్వాధీనం చేసుకున్నారు.
:ఏలూరు పట్టణవాసి కమ్ముల రాధ, ఆమె కుమార్తె సుమలతకు తాడేపల్లిగూడెంలో ఉన్న స్థలాన్ని దగ్గర బంధువైన పట్టణానికి చెందిన సిరింగి ఎడ్వర్డ్ కెన్నడి చూస్తున్నారు. ఆ స్థలాన్ని సర్వే చేయించడం కోసం జనవరిలో చలానా తీసి దరఖాస్తు చేసుకున్నారు. టౌన్ సర్వేయర్ రౌతు రామకృష్ణ అదే నెలలో సర్వే చేశారు. కానీ సర్వే నివేదికను ఇవ్వకుండా జాప్యం చేస్తూ వచ్చారు. నివేదిక ఇవ్వాలని ఎన్నోసార్లు అభ్యర్థించగా రూ.50 వేలు డిమాండ్ చేయడంతో ఆ సొమ్మును ఎడ్వర్డ్ కెన్నడి ద్వారా పంపించారు. అప్పటికే విసుగు చెందిన ఆయన అనిశా అధికారులను ఆశ్రయించడంతో సొమ్ములిస్తున్న సమయంలోనే రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. అతని ఇంటిపై, కార్యాలయ ప్రాంగణాల్లో ఏక కాలంలో సోదాలు నిర్వహించారు. పలు దస్త్రాలను సేకరించి రాజమహేంద్రవరం అనిశా కోర్టు ముందు హాజరు పరచనున్నట్లు అనిశా డీఎస్పీ జీవీ కృష్ణారావు వెల్లడించారు. దాడుల్లో అనిశా సీఐలు ఎం.బాలకృష్ణ, కె.శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు.
మున్సిపల్ సర్వేయర్ రామకృష్ణ అనిశా అధికారులకు పట్టుబడ్డారన్న సమాచారం తెలియడంతో తాడేపల్లిగూడెం పురపాలికలో పలువురు సిబ్బంది ఉలిక్కిపడ్డారు. ఏం చెప్పారు, ఎవరి పేర్లు బయటకొస్తాయోననే ఆందోళన చెందడం కనిపించింది. రెండు నెలలుగా తిప్పుతున్నారని, ఇతర అధికారుల ప్రమేయంపైనా ఆరా తీయాలని పలువురు కోరుతున్నారు. గతంలోనూ పట్టణ ప్రణాళిక విభాగంపై దాడులు జరిగాయని, పూర్తిగా విచారణ చేస్తే మరిన్ని విషయాలు బయటకొస్తాయని అంటున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ