
పార్వతీపురం,, 18 మార్చి (హి.స.) : జిల్లాలో ఖరీఫ్ సీజన్కు సంబంధించి ధాన్యం కొనుగోలు ప్రక్రియ చివరి దశకు చేరిందని సంయుక్త కలెక్టర్, ఐటీడీఏ పీవో సి.యశ్వంత్కుమార్రెడ్డి చెప్పారు. మంగళవారం మాట్లాడారు. ఈ ఏడాది లక్ష్యానికి మించి ధాన్యాన్ని కొనుగోలు చేశామని, ఇప్పటివరకు 2,65,500 మెట్రిక్ టన్నులు సేకరించామన్నారు. వివరాలు ఆయన మాటల్లోనే..
మూడో విడతలో 43 గ్రామాలను తీసుకున్నాం. 27 గ్రామాల్లో గ్రౌండ్ ట్రూథింగ్ పూర్తయ్యింది. ఇప్పటికే 17 గ్రామాల్లో ప్రక్రియ ముగిసింది. నాలుగో విడత రీసర్వేను 83 గ్రామాల్లో చేపట్టనున్నాం. ఇందులో రాష్ట్రంలోనే జిల్లా ముందుంది. తప్పులు జరగకుండా సిబ్బందికి శిక్షణ ఇచ్చాం. సిగ్నలింగ్ వ్యవస్థ బలహీనంగా ఉన్న గ్రామాల్లో శాటిలైట్ ఆధారిత సాంకేతికతతో రీసర్వే నిర్వహించనున్నాం. జిల్లాలో 336 గ్రామాల్లో ఈ విధానంలో రీసర్వే చేయడానికి ఏజెన్సీని కూడా గుర్తించాం. ఈ గ్రామాల్లో ప్రస్తుతం ఉపయోగిస్తున్న రోవర్లతో పనిచేయడం సాధ్యం కానందున ప్రత్యేక ఏజెన్సీ సేవలను వినియోగించుకుంటున్నాం.
భద్రగిరి, కురుపాం సామాజిక ఆసుపత్రుల అభివృద్ధి పనులు తుది దశకు వచ్చాయి. త్వరలోనే సేవలు ప్రారంభించనున్నాం. ఆశ్రమ పాఠశాలల విద్యార్థులు సెలవుల్లో ఇళ్లకు వెళ్లిన తర్వాత అనారోగ్యానికి గురికాకుండా చర్యలు తీసుకోనున్నాం.వంట గ్యాస్కు సంబంధించి జిల్లాలో ఎటువంటి సమస్యలు లేవు.
ఐటీడీఏ పరిధిలోని గిరిజనులకు ట్రైకార్, సెర్ప్ సంయుక్తంగా జీవనోపాధులు కల్పించేందుకు పథకాలను అమలు చేస్తున్నాం. రూ.30 కోట్లతో గిరిజన సంక్షేమ పాఠశాలల్లో మరమ్మతులు జరుగుతున్నాయి. అన్ని ఆశ్రమ విద్యాలయాల్లో మరుగుదొడ్లు నిర్మిస్తున్నాం.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ