
అమరావతి, 18 మార్చి (హి.స.): పదోతరగతి జవాబుపత్రాల మూల్యాంకనంలో మార్కుల నమోదు, రీవెరిఫికేషన్, రీకౌంటింగ్లో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకునేందుకు పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీచేసింది. ఇప్పటికే ఇంటర్మీడియట్లో ఉన్న నిబంధనలను ఈ ఏడాది పదో తరగతి మూల్యాంకనానికీ అమలు చేయనుంది. పదోతరగతి జవాబు పత్రాల మూల్యాంకనం ఏప్రిల్ 4 నుంచి 10 వరకు నిర్వహించనున్నారు. గతేడాది మార్కుల కౌంటింగ్లో కొన్ని తప్పిదాలు చోటుచేసుకున్నందున ఈసారి విద్యార్థులకు అన్యాయం జరగకుండా ఉండేందుకు తప్పు చేసిన సిబ్బందికి జరిమానా విధించేలా నిబంధనలు తీసుకొచ్చింది. ట్యాబ్లలో మార్కులు నమోదుచేయడం వల్ల కౌంటింగ్లో తప్పులు తగ్గుతాయి. ఒకవేళ మూల్యాంకనంలో నిర్లక్ష్యం, లోపాలను గుర్తిస్తే నివేదికను కమిషనర్, డైరెక్టర్కు సమర్పిస్తారు. ముందుగా సిబ్బంది వివరణ కోరుతూ నోటీసులు ఇస్తారు. వివరణ ఇచ్చిన తర్వాత దీనిపై నిర్ణయం తీసుకుంటారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ