
మెదక్, 18 మార్చి (హి.స.)
మారుతున్న వాతావరణ పరిస్థితులు,
వ్యవసాయ రంగంలో జరుగుతున్న సాంకేతిక మార్పులకు అనుగుణంగా రైతులు నూతన సాంకేతిక పద్ధతులను అవలంభిస్తూ ఆధునిక వ్యవసాయాన్ని చేపట్టాలని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. బుధవారం కౌడిపల్లి మండలం తునికి కృషి విజ్ఞాన కేంద్రంలో ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ & జిల్లా వ్యవసాయ శాఖ అధికారి దేవకుమార్ ఆధ్వర్యంలో అధిక సాంద్రత సాగు పై కిసాన్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కిసాన్ మేళా సందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ వ్యవసాయ స్టాళ్లను కలెక్టర్ ప్రారంభించి పరిశీలించారు. రైతులకు అందుబాటులో ఉన్న ఆధునిక వ్యవసాయ సాంకేతిక పద్ధతులు, పంటల నిర్వహణ విధానాలు, యంత్రాల వినియోగం, పంట రక్షణ చర్యల పై ఏర్పాటు చేసిన ప్రదర్శనలను ఆసక్తిగా సందర్శించి రైతులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాపాలన 99 రోజుల ప్రగతి ప్రణాళికలో భాగంగా కిసాన్ మేళా ఏర్పాటు చేశారని తెలిపారు. రైతులు శాస్త్రవేత్తలు సూచించే ఆధునిక పద్ధతులను అనుసరించడం ద్వారా పంటల దిగుబడిని పెంచుకోవచ్చని తెలిపారు.
కృషి విజ్ఞాన కేంద్రం అందిస్తున్న శిక్షణలు, శాస్త్రీయ సూచనలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పంట మార్పిడి పద్ధతులను అమలు చేయడం ద్వారా నేల సారాన్ని కాపాడుకోవడంతో పాటు అధిక దిగుబడులు సాధించవచ్చని పేర్కొన్నారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..