నేడు కాంగ్రెస్ అధికారంలో ఉంది.. రేపు జాగృతి అధికారంలోకి రావచ్చు: కవిత
ఈ పరాభవ నామ సంవత్సర ఉగాది అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆకాంక్షించారు.
Kavitha


హైదరాబాద్, 19 మార్చి (హి.స.)ఈ పరాభవ నామ సంవత్సర ఉగాది అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆకాంక్షించారు. గురువారం హైదరాబాద్ జాగృతి కార్యాలయంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో కవితతోపాటు జాగృతి నేతలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ.. మన క్యారెక్టర్ సరిచేసుకుంటూ తెలంగాణ సమాజాన్ని ముందుకు తీసుకువెళ్లాలని జాగృతి నేతలకు పిలుపునిచ్చారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది.. రేపు జాగృతి అధికారంలోకి రావొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి ఉగాది రోజు.. ప్రజా బడ్జెట్ను తెలంగాణ జాగృతి ప్రవేశ పెడుతుందన్నారు.

శుక్రవారం రూ.3.23 లక్షల కోట్ల బడ్జెట్ తెలంగాణ అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశ పెడుతోందని తెలుస్తుందన్నారు. ఈ బడ్జెట్లో విద్య, వైద్యానికి అధికంగా నిధులు కేటాయించాలని ప్రభుత్వానికి ఆమె సూచించారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియాగాంధీ జన్మదినం లోపు ఫించన్లు పెంచాలని రేవంత్ ప్రభుత్వానికి స్పష్టం చేశారు. పేదలకు ఇళ్ల నిర్మించడంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందన్నారు.

తెలంగాణ రావడానికి కారణమైన ఉద్యమకారులకు రూ.5 వేల కోట్లు, కౌలు రైతుల కోసం రూ.35 వేల కోట్లు, బీసీల కోసం రూ. 20 వేల కోట్లు బడ్జెట్లో కేటాయించాలని ప్రభుత్వాన్ని కవిత డిమాండ్ చేశారు. దళితులకు కేటాయించిన బడ్జెట్ను పక్కదారి పట్టిస్తున్నారంటూ ప్రభుత్వ పెద్దలపై మండిపడ్డారు. పరాభవ అంటే.. ప అంటే పలుకుబడి, రా అంటే రాబడి, భ అంటే భవిష్యత్తు, వ అంటే వర్ధిల్లాలి తెలంగాణ ప్రజలని కల్వకుంట్ల కవిత అభివర్ణించారు. కాలానికి అనుగుణంగా నడిచిన వారే బాగుంటారని కవిత పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande