
హైదరాబాద్, 20 మార్చి (హి.స.)
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తున్నది. అసెంబ్లీ సమావేశాల తర్వాత కేబినెట్ విస్తరణ లేదా ప్రక్షాళన చేయనున్నట్లు ప్రచారం జరుగుతున్నది.
విస్తరణకే పరిమితమైతే ఖాళీగా ఉన్న రెండు మంత్రి పదవులను భర్తీ చేయనున్నారు. ప్రక్షాళన చేయాల్సి వస్తే ఒకరిద్దరు మంత్రులను తొలగించి, వారి స్థానంలో కొత్త వారిని నియమిస్తారని చర్చ జరుగుతున్నది.
అయితే ఈ సారి ఎలాంటి ఖాళీలు లేకుండా పూర్తి స్థాయి కేబినెట్ ను ఏర్పాటు చేసే యోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్లు తెలిసింది.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపుగా రెండున్నరేళ్లు అవుతున్నది. ఇప్పటికీ రెండు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేయకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. భవిష్యత్తులో ఈ విమర్శల తీవ్రత మరింత పెరిగే అవకాశముంది. ఈ నేపథ్యంలో ఆ రెండు ఖాళీలను భర్తీ చేయడానికి సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. అయితే కొందరు మంత్రుల పనితీరుపై పలు నివేదికలు తెప్పించుకున్న హైకమాండ్.. నిత్యం వివాదాలు, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులను పక్కన పెడితే ఎలా ఉంటుందనే కోణంలోనూ ఆరా తీస్తున్నట్లు తెలిసింది. అందులో భాగంగా ఒకరిద్దరు మంత్రులను పక్కన పెట్టే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఆ జాబితాలో దక్షిణ తెలంగాణకు చెందిన ఒక మంత్రి, ఉత్తర తెలంగాణ ప్రాంతానికి చెందిన మరో మంత్రి పేరు ఉన్నట్లు చర్చ జరుగుతున్నది. అయితే వారిద్దరి స్థానంలో అదే సామాజికవర్గానికి చెందిన వ్యక్తులను మంత్రులుగా తీసుకోనున్నట్టు టాక్..
ఆగస్ట్ తర్వాత అవుటర్ రింగ్ రోడ్డు పరిధిలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఆ ఎన్నికల బాధ్యతలను మంత్రులందరికీ అప్పగించాలనే ఆలోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్లు తెలిసింది. ఒకవేళ అసెంబ్లీ సమావేశాల తరువాత కేబినెట్ ప్రక్షాళన చేస్తే.. పార్టీలో అంతర్గతంగా తలెత్తే అలకలు, అసంతృప్తులకు చెక్ పెట్టేందుకు సమయం దొరుకుతుందని భావిస్తున్నట్లు సమాచారం. 'బడ్జెట్ సమావేశాలు ముగిసిన వారం, పది రోజుల్లో ప్రక్షాళన జరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ సమీకరణలు కుదరకపోతే కేవలం ఖాళీగా ఉన్న రెండు మంత్రి పదవులను భర్తీ చేస్తారు. ఆ మేరకు ఈ మధ్య ఢిల్లీకి వెళ్లినప్పుడు సీఎం రేవంత్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు' అని కాంగ్రెస్ హైకమాండ్ తో సన్నిహిత సంబంధాలు ఉన్న ఓ సీనియర్ లీడర్ వివరించారు.
కొందరు మంత్రుల శాఖలను మార్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. ఈ రెండున్నరేళ్ల కాలంలో మంత్రుల పనితీరు ఆధారంగా శాఖలను మార్చేందుకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కొందరు మంత్రులు తమకు కేటాయించిన శాఖలపై ఇంకా పట్టు సాధించలేదనే విమర్శలు ఉన్నాయి. ఇంకొందరు అధికారాన్ని అడ్డం పెట్టుకుని పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు వెళ్లినట్లు తెలిసింది. అలాంటి మంత్రులను కేబినెట్ నుంచి తప్పించే అవకాశం లేకపోతే మాత్రం ప్రస్తుతం ఉన్న శాఖను తప్పించి, మరో పోర్ట్ ఫోలియోను అప్పగించే చాన్స్ ఉన్నట్లు చర్చ జరుగుతున్నది.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..