
హైదరాబాద్, 19 మార్చి (హి.స.) మొయినాబాద్లోని రోహిత్ రెడ్డికి చెందిన ఫాంహౌస్ డ్రగ్ పార్టీ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఒక వైపు డ్రగ్స్ ఎక్కడి నుంచి సేకరించారనే విషయంలో విచారణ జరుగుతుండగానే మరోవైపు రోహిత్ రెడ్డి, ఆయన సోదరుడు రితీష్ రెడ్డి, నమిత్ శర్మలపై హత్యాయత్నం కేసు నమోదైంది. ఇక డ్రగ్స్ కేసులో ఏ 7 నిందితుడైన ఎపీకి చెందిన ఎంపీ పుట్టా మహేష్ పార్లమెంట్ సమావేశాలకు హాజరు కావడానికి ఢిల్లీ వెళ్లారు. ఏప్రిల్ 4 తరువాత విచారణకు అందుబాటులో ఉంటానని చెప్పడం గమనార్హం. కాగా మోయినాబాద్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో ఎన్డీపీఎస్ యాక్ట్, ఆర్మ్స్ యాక్ట్, ఎక్సైజ్ యాక్ట్, బీఎన్ఎ స్ చట్టాల కింద కేసు నమోదు చేశారు. మొత్తంగా 12 సెక్షన్ల కింద నమోదైన కేసులో సిట్ ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ కేసులో నిందితులైన ఏడుగురిని మంగళవారం సాయంత్రం నుంచి సిట్ అధికారులు విచారిస్తున్నారు. బుధవారం కూడా సుమారు 8 గంటల పాటు కౌశిక్ రవి, శరత్ కుమార్, అర్జున్ రెడ్డి, రమేష్, శ్రవణ్ కుమార్, విజయ్ కృష్ణలను విచారించి స్టేట్మెంట్ తీసుకున్నట్లు తెలిసింది. వారందరూ రోహిత్ రెడ్డి పిలిస్తేనే పార్టీకి వచ్చినట్లు తెలిపారని, ఒకేసారి రాలేదని 13న సాయంత్రం 6 గంటల నుంచి వివిధ సమయాల్లో ఫాం హౌస్ చేరుకున్నట్టు స్టేట్మెంట్ ఇచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలో నిందితులను అడిక్షన్ సెంటర్కు రిఫర్ చేస్తామని సిట్ అధికారులు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. కేసుల నమోదు సమయంలో అడిక్షన్ సెంటర్కు పంపుతామని చెప్పినా వారంతా వెళ్లడానికి నిరాకరించారని ఈగల్ అధికారులు చెబుతున్నారు.
సిట్ అధికారులు మొయినాబాద్ ఫాం హౌస్ ప్రాంతంలో ఉన్న సీసీ కెమోరాలపై దృష్టి సారించారు. కాల్పుల ఘటనకు సంబంధించి కీలక ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. చుట్టు పక్కల ఉన్న నివాస సముదాయలకు, ఫాం హౌస్ సీసీ ఫుటేజ్ సేకరణకు నోటీసులు అందజేశారు. సుమారు 100 సీసీ కెమెరాల ఫుటేజిని పరిశీలించేందుకు చర్యలు చేపట్టారు. రోహిత్ రెడ్డి సోదరుల ఆదేశాలతోనే నమిత్ శర్మ కాల్పులు జరిపినట్టు నిర్ధారించేందుకు టెక్నికల్ ఎవిడెన్స్ సేకరిస్తున్నారు. చంఛల్ గూడా జైలులో రిమాండ్లో ఉన్న ముగ్గురిని కస్టడి విచారణకు ఇస్తే మరిన్ని విషయాలు బయటకు వస్తాయని సిట్ అధికారులు భావిస్తున్నారు.
కస్టడీ విచారణ కోరుతూ ఉప్పర్పల్లి కోర్టులో దాఖలైన పిటిషన్పై బుధవారం విచారణ జరగగా 23కు కోర్టు విచారణ వాయిదా వేసింది. మరోవైపు డ్రగ్స్ కొనుగోలు అంశంలో ప్రధానంగా సిట్ విచారణ చేపట్టగా హైదరాబాద్లోనే అభిషేక్ సింగ్ అనే స్వాఫ్ట్ వేర్ ఉద్యోగి నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు రోహిత్ రెడ్డి డ్రైవర్ శరత్ తెలిపినట్లు సమాచారం.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు