రేపే తెలంగాణ బడ్జెట్.. సంక్షేమం, వ్యవసాయం, నీటి పారుదల రంగాలకు భారీ కేటాయింపులు ఉండే అవకాశం..
హైదరాబాద్, 19 మార్చి (హి.స.) రాబోయే ఆర్థిక సంవత్సరం 2026-27కు సంబంధించి బడ్జెట్కు రాష్ట్ర ప్రభుత్వం తుదిరూపం ఇచ్చినట్లు తెలుస్తోంది. బడ్జెట్లో సంక్షేమం, వ్యవసాయం, నీటి పారుదల రంగాలకు పెద్దపీట వేస్తూ భారీగా కేటాయింపులు చేయనున్నట్లు సమాచారం. హామీల అ
Budget


హైదరాబాద్, 19 మార్చి (హి.స.)

రాబోయే ఆర్థిక సంవత్సరం 2026-27కు సంబంధించి బడ్జెట్కు రాష్ట్ర ప్రభుత్వం తుదిరూపం ఇచ్చినట్లు తెలుస్తోంది. బడ్జెట్లో సంక్షేమం, వ్యవసాయం, నీటి పారుదల రంగాలకు పెద్దపీట వేస్తూ భారీగా కేటాయింపులు చేయనున్నట్లు సమాచారం. హామీల అమలుతోపాటు ప్రజల భవిష్యత్ అవసరాలు తీర్చడమే లక్ష్యంగా బడ్జెట్ను రూపొందించినట్లు చర్చ జరుగుతున్నది. అంతేకాకుండా తెలంగాణ విజన్-2047 డాక్యుమెంట్లోని అంశాలకు కూడా ప్రత్యేక నిధులు కేటాయించడం తో పాటు హామీల అమలుపై ఫోకస్ పెట్టనున్నట్లు సమాచారం. దీనిపైనే రేపు ఉదయం 9.30 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్లో సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ భేటీలో బడ్జెట్కు ఆమోదం తెలపనున్నారు. అనంతరం అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, శాసనమండలిలో శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు.

2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.3.04 లక్షల కోట్లతో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వ ఓన్ టాక్స్ రెవెన్యూ (ఓటీఆర్ఆర్) పెరిగింది. అదే సమయంలో వచ్చే సంవత్సరం ప్రభుత్వ ఆదాయం మరింత పెరుగుతుందని, కేంద్రం నుంచి వచ్చే నిధులు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో గత ఏడాది కంటే అధికంగానే బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్లు చర్చ జరుగుతున్నది. రాబోయే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.3.26 లక్షల కోట్ల వరకు బడ్జెట్ ఉండొచ్చని భావిస్తున్నారు. అయితే కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన నేపథ్యంలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళా సంక్షేమం, సన్న బియ్యం కోసం పెద్ద ఎత్తున నిధులు కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధమైందని సమాచారం.

అదే సమయంలో ఇతర ఏ రాష్ట్రాల్లో లేనివిధంగా వ్యవసాయానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నట్లు గా ప్రకటించే అవకాశముంది. రైతు భరోసా, రైతు బీమా, సన్న వడ్లకు బోనస్ తదితర పథకాలకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించనున్నట్లు తెలుస్తోంది.

నీటిపారుదల ప్రాజెక్టుల భూసేకరణ కోసం రూ.5 వేల కోట్ల వరకు అవసరమవుతాయని అంచనా వేయగా.. ఈ బడ్జెట్లో నిధులను కేటాయించే అవకాశముంది. తుమ్మిడిహెట్టి, సీతారామ, పాలమూరు-రంగారెడ్డి, కొడంగల్ నారాయణ్్పట్ ఎత్తిపోతలు, ఎస్ఎల్బీసీలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు సమాచారం. అంతేకాకుండా యువతులకు ఈవీ స్కూటీలను అందించేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తుండగా.. వీటికి సైతం నిధులు కేటాయించే అవకాశముంది. విద్యారంగానికి కూడా కేటాయింపులు పెంచే చాన్స్ ఉన్నది.

ఉద్యోగులకు పీఆర్సీ అమలు, డీఏల విడుదల, రిటైర్డ్ ఉద్యోగులకు బకాయిల చెల్లింపుల కోసం బడ్జెట్లో వీలైనంత ఎక్కువ కేటాయింపులు చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా మూసీ పునరుజ్జీవం, ట్రిపుల్ ఆర్, విమానాశ్రయాలు, మెట్రో రెండో దశ, స్కిల్, స్పోర్ట్స్ యూనివర్సిటీలు, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ హాస్టల్స్.. తదితరాలకు పెద్ద ఎత్తున నిధుల కేటాయించే అవకాశముంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande