
కరీంనగర్, 19 మార్చి (హి.స.)
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాడే భాష, ఎంఐఎం పట్ల రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం కరీంనగర్లో ఉగాది వేడుకల సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజకీయ, సామాజిక అంశాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల 'తొక్కుకుంటూ వచ్చాను' అని చేసిన వ్యాఖ్యలపై బండి సంజయ్ స్పందిస్తూ.. సొంత పార్టీ నేతలనే తొక్కుతారా? ఆ వార్నింగ్ కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నేతలను ఉద్దేశించినదేనని ఎద్దేవా చేశారు. ప్రజల ఆశీస్సులతో గెలిచానని చెప్పకుండా, అందరినీ తొక్కుకుంటూ వచ్చానని అనడం రేవంత్ అహంకారానికి నిదర్శనమని, ఆయన భాషను చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని విమర్శించారు.
శాసనసభలో 'వందేమాతరం' గేయాలాపనను ఎంఐఎం ఎమ్మెల్యేలు బహిష్కరించడాన్ని బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు. 'జాతీయ గేయాన్ని అవమానిస్తే ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు? స్పీకర్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?' అని ప్రశ్నించారు. బీజేపీ అధికారంలో ఉంటే ఇలాంటి వారిని కటకటాల్లోకి నెట్టేవాళ్లమని, భవిష్యత్తులో బీజేపీ అధికారంలోకి వస్తే నిద్రలో కూడా వందేమాతరం గుర్తుండేలా ఎంఐఎం మెడలు వంచుతామని హెచ్చరించారు.
రైతు భరోసా అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని బండి సంజయ్ ఆరోపించారు. రైతులకు, కౌలు రైతులకు కలిపి ప్రభుత్వం ఇప్పటివరకు రూ. 41 వేల కోట్లు బాకీ పడిందని లెక్కలు వివరించారు. ఒక్కో రైతుకు సుమారు రూ.30 వేలు, వ్యవసాయ కూలీలకు రూ.36 వేల చొప్పున రావాల్సి ఉందన్నారు. తక్షణమే ఈ బకాయిలను రైతుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు.
మూసీ నది ప్రక్షాళనకు బీజేపీ వ్యతిరేకం కాదని, కానీ పేదల ఇళ్లను కూల్చడాన్ని సహించబోమని స్పష్టం చేశారు. 'గుజరాత్ లోని సబర్మతి నది తరహాలో ప్రక్షాళన చేపట్టాలి. బాధితులకు ఇళ్లు కట్టించి, అన్ని సౌకర్యాలు కల్పించాకే పనులు ప్రారంభించాలి. పేదల ఇళ్లు కూల్చాలనుకుంటే బుల్డోజర్లకు అడ్డంగా నిలబడతాం' అని హెచ్చరించారు.
బీఆర్ఎస్ అవినీతిపై కాంగ్రెస్ చర్యలు తీసుకోవడం లేదని, అలాగే కాంగ్రెస్ ఆరు గ్యారంటీలపై బీఆర్ఎస్ గట్టిగా నిలదీయడం లేదని.. ఈ రెండు పార్టీల మధ్య రహస్య ఒప్పందం ఉందని బండి ఆరోపించారు. హోంశాఖ ప్రాధాన్యత లేనిదని మంత్రి శ్రీధర్ బాబు చేసిన వ్యాఖ్యలను తిప్పికొడుతూ.. దేశ భద్రతకు సంబంధించిన అత్యంత కీలకమైన శాఖను ప్రధాని మోడీ తనకు అప్పగించారని ఆయన గర్వంగా చెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..