ప్రచారం చేస్తే చర్యలు తప్పవు.. 'ఉస్తాద్ భగత్ సింగ్'పై బెంగళూరు కోర్టు సంచలన తీర్పు!
బెంగళూరు, 19 మార్చి (హి.స.) పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ''ఉస్తాద్ భగత్ సింగ్'' చిత్రంపై సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారానికి అడ్డుకట్ట వేస్తూ బెంగళూరు సిటీ సివిల్ అండ్ సెషన్స్ కోర్టు సంచలన తీర్పును వెల్లడించి
Pawan Kalyan


బెంగళూరు, 19 మార్చి (హి.స.)

పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రంపై సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారానికి అడ్డుకట్ట వేస్తూ బెంగళూరు సిటీ సివిల్ అండ్ సెషన్స్ కోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. ఈ సినిమా గురించి అభ్యంతరకరమైన, కించపరిచే లేదా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయకుండా ఉండేందుకు 'జాన్ డో' (John Doe) ఇంజక్షన్ ఉత్తర్వులను జారీ చేస్తూ న్యాయమూర్తి జీవనరావు వసంతరావు కులకర్ణి ఆదేశాలు జారీ చేశారు. సినిమా విడుదలకు ముందు కొంతమంది వ్యక్తులు కావాలని నెగెటివ్ ప్రచారం చేస్తూ బాక్సాఫీస్ కలెక్షన్లను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారంటూ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన కోర్టు ఈ మేరకు స్పందించింది.

ఈ కోర్టు ఉత్తర్వుల ప్రకారం ఎక్స్, యూట్యూబ్, ఫేస్బుక్, మెటా వంటి సామాజిక మాధ్యమాలతో పాటు బుక్మైషో, ఐఎండీబీ వంటి ప్లాట్ఫారమ్లలో సినిమా ప్రతిష్టను దిగజార్చే కంటెంట్ను ప్రసారం చేయడంపై నిషేధం ఉంటుంది. సాధారణంగా వ్యక్తుల పేర్లు తెలియని పక్షంలో అజ్ఞాత యూజర్లందరినీ ఉద్దేశించి జారీ చేసే ఈ 'జాన్ డో' ఆర్డర్ వల్ల అభ్యంతరకర పోస్టులను ఆయా సంస్థలు వెంటనే తొలగించాల్సి ఉంటుంది. ఈ స్టే ఆర్డర్ తదుపరి విచారణ జరిగే ఏప్రిల్ 27 వరకు అమలులో ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. ఉగాది కానుకగా నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రంలో శ్రీలీల, రాశి ఖన్నా కథానాయికలుగా నటించగా, దేవి శ్రీ ప్రసాద్ మరియు థమన్ సంగీతాన్ని అందించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande