
హైదరాబాద్, 19 మార్చి (హి.స.)
రంజాన్ వేళ కీసర మీదుగా రెండు డీసీఎం వాహనాల్లో అక్రమంగా ఆవులను తరలిస్తున్న ముఠాను కీసర విశ్వ హిందూ పరిషత్ నాయకులు గురువారం అడ్డుకొని పట్టుకున్నారు. కీసరగుట్ట కమాన్ వద్ద వాహనాలను ఆపాలని ప్రయత్నించినప్పటికీ అవి ఆగకుండా వెళ్లిపోయాయి. చివరికి కీసర రాఘవేంద్ర హోటల్ వద్దకు చేరుకున్న సమయంలో డీసీఎం వాహనాలను అడ్డగించి పట్టుకున్నారు. సమాచారం అందుకున్న కీసర పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే డీసీఎం వాహనాల అద్దాలు పగులగొట్టడంతో పాటు డ్రైవర్లను బెదిరించినట్లు సమాచారం. రెండు డీసీఎం వాహనాలను కీసర పోలీస్ స్టేషన్కు తరలించారు. కీసర పోలీసుల ఆధ్వర్యంలో చర్యలు తీసుకున్నారు. పట్టుకున్న ఆవులను సమీపంలోని హైజా గోశాల లేదా జియగూడ గోశాలకు తరలిస్తామని పోలీసులు తెలిపారు. దీంతో విశ్వ హిందూ పరిషత్ నాయకులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనతో కీసర రోడ్డు పై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు