
తిరుమల, 19 మార్చి (హి.స.)
తెలుగు నూతన సంవత్సర పండుగ 'ఉగాది' పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల క్షేత్రం భక్తులతో కిక్కిరిసిపోయింది. స్వామివారి దర్శనం కోసం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలిరావడంతో తిరుగిరిలో కోలాహలం నెలకొంది. ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం కంటే ఎక్కువగా ఉంది. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనం (Free Darshan) కోసం సుమారు 12 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 17 కంపార్టుమెంట్లు భక్తులతో పూర్తిగా నిండిపోయాయి. క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు టీటీడీ (TTD) అధికారులు నిరంతరం అన్నప్రసాదాలు, పాలు, తాగు నీరు అందిస్తున్నారు.
ఆలయంలో ప్రత్యేక పూజలు..
బుధవారం నాటి స్వామివారి దర్శన మరియు ఆదాయ వివరాలను అధికారులు వెల్లడించారు. నిన్న ఒక్కరోజే 72,332 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. భక్తులు స్వామివారికి మొక్కుల రూపంలో సమర్పించిన కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.53 కోట్లు వచ్చినట్లు టీటీడీ తెలిపింది. మొక్కులు చెల్లించుకోవడానికి 21,852 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. ఉగాది పర్వదినం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, ఉగాది ఆస్థానం నిర్వహించనున్నారు. రద్దీ దృష్ట్యా భక్తులు సహనంతో వేచి ఉండాలని అధికారులు కోరుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV