
కడప, 19 మార్చి (హి.స.)
భిన్నత్వంలో ఏకత్వానికి, హిందూ-ముస్లిం సోదరభావానికి వైఎస్సార్ కడప జిల్లా ప్రతీకగా నిలిచింది. ఉగాది పండుగ వేళ జిల్లాలో అద్భుతమైన మతసామరస్యం వెల్లివిరిసింది. ముస్లింలు హిందూ దేవాలయానికి తరలివచ్చి భక్తిశ్రద్ధలతో స్వామివారికి పూజలు నిర్వహించారు. కడపలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రతి ఏటా ఉగాది పండుగ రోజున ఈ అరుదైన దృశ్యం ఆవిష్కృతమవుతుంది. తాజాగా ‘శ్రీ పరాభవ నామ’ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లిం మహిళలు శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి విచ్చేశారు. తమ ఆనవాయితీ ప్రకారం స్వామివారికి సారె సమర్పించి, ప్రత్యేక పూజలు చేశారు.
ఈ విశిష్ట ఆచారం వెనుక స్థానికంగా ఓ పురాణ గాథ ఉందని ప్రచారంలో ఉంది. శ్రీ వేంకటేశ్వర స్వామివారు.. ముస్లిం ఆడపడుచు అయిన బీబీ నాంచారమ్మను వివాహం చేసుకున్నారని ఇక్కడి వారు విశ్వసిస్తారు. ఈ కారణంగానే బీబీ నాంచారమ్మను తమ ఇంటి ఆడబిడ్డగా, శ్రీవారిని తమ అల్లుడిగా స్థానిక ముస్లింలు కొలుస్తారు. తమ ఇంటి అల్లుడిపై ఉన్న ప్రేమతో, ప్రతి ఏటా తెలుగు సంవత్సరాది (ఉగాది) నాడు ఇలా దేవుని కడప ఆలయానికి విచ్చేసి స్వామి వారిని దర్శించుకుంటారు. కులమతాలకు అతీతంగా సాగుతున్న ఈ సంప్రదాయం అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV