
కోల్కతా:, 20 మార్చి (హి.స.) పశ్చిమబెంగాల్లో సంచలనం సృష్టించిన ఆర్జీ కర్ ఆస్పత్రిలో వైద్య విద్యార్థిని రేప్, హత్య ఘటనలో బాధితురాలి తల్లికి ఈసారి టికెట్ ఇవ్వాలని బీజేపీ భావిస్తోంది. పనిహాతీ నియోజకవర్గం నుంచి ఈమెను బరిలో దింపాలని విపక్ష బీజేపీ గతంలో నిర్ణయించుకున్నా అందుకు అప్పట్లో ఈమె తన సమ్మతి తెలపలేదు. తాజాగా రంగంలోకి దూకాలని నిర్ణయించుకున్నట్లు ఆమె గురువారం ప్రకటించారు.
‘‘మమతా బెనర్జీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే హత్యాచార ఘటనలో మాకు ఇంతవరకు న్యాయం జరగలేదు. నా కూతురు విషయంలో న్యాయపోరాటంలో భాగంగా బరిలోకి దిగుతా. పనిహాతీ నియోజకవర్గం నుంచి నాకు టికెట్ ఇవ్వాలని బీజేపీ నాయకులను వ్యక్తిగతంగా అడిగాను. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి బీజేపీ నాకు అవకాశం కల్పిస్తే బెంగాల్లో తణమూల్ ప్రభుత్వాన్ని ఓడించి మహిళలకు భద్రత కల్పించడానికి ప్రయత్నిస్తాను’’ అని ఆమె అన్నారు. కాగా, బీజేపీ తాజాగా విడుదల చేసిన బీజేపీ రెండో జాబితా లోనూ ఆమె పేరు లేదు.
కచ్చితంగా టికెట్ వస్తుంది
బాధితురాలి తండ్రి మాట్లాడుతూ.. తన భార్య అభ్యర్థిత్వం గురించి బీజేపీ నాయకులతో ఇప్పటికే ప్రాథమిక చర్చలు జరిగాయన్నారు. తాము లాంఛనంగా పార్టీలో చేరిన తర్వాతే తన భార్యను అభ్యర్థిగా ప్రకటిస్తారని వెల్లడించారు. తమకు కచ్చితంగా పోటీ చేసే అవకాశం బీజేపీ కల్పిస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. మహిళల భద్రత కోసం పోరాడటానికే తన భార్య ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తోందని చెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ