
చతిస్గడ్, 20 మార్చి (హి.స.)
ఈ నెల 31 లోగా మావోయిస్టుల అంతమే లక్ష్యంగా చతిస్గడ్ లో కొనసాగుతున్న ఆపరేషన్ ఫోర్ లో వేలాది బలగాలు పాల్గొంటున్నాయి. ఆపరేషన్ కగార్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు సుమారు 400 మంది వరకు మావోయిస్టులు భద్రతా బలగాల దాడుల్లో మరణించారు. మరో 3 వేల మందికి పైగా పోలీసుల సమక్షంలో ఆయుధాలతోనో లేక ఆయుధాలు లేకుండానో జనజీవన స్రవంతిలో కలిశారు. మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి బసవరాజు సహా పలువురు సీసీ సభ్యులు, ఇతర స్థాయిల నేతలు మరణించడం, పొలిట్బ్యూరో, సీసీ సభ్యులు సహా పలువురు నేతలు లొంగిపోవడం వంటి పరిణామాల నేపథ్యంలో ఇటీవలే ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ ఒక కీలక ప్రకటన చేశారు. ఛత్తీస్గఢ్ మొత్తం 30 ఏరియాల్లో మావోయిస్టుల కార్యకలాపాలు ఉండగా, ఇప్పటి వరకు 26 ఏరియాలను మావోయిస్టు ముక్తా మార్చేశామని తెలిపారు. ఇక కేవలం నాలుగు ఏరియా కమిటీలు మాత్రమే యాక్టివ్గా ఉన్నాయన్నారు. ఈ నెల 31 లోగా వీరిని కూడా లొంగుబాటుకు ఒప్పించడమో లేక బలగాలను ప్రయోగించి చేస్తామని స్పష్టం చేశారు. ఇందుకోసమే ప్రస్తుతం ఆపరేషన్ ఫోర్ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. అంతమొందించడమో
అయితే, పోలీసులు చేస్తున్న సరెండర్ ప్రయత్నాలు ఈ నాలుగు ఏరియా కమిటీల విషయంలో సఫలం కాలేదు. ఇరుగు పొరుగు ఏరియాల మావోయిస్టులు, బెటాలియన్ సభ్యులు అందరూ ఛత్తీస్ గఢ్ లోనో, తెలంగాణలోనో లొంగిపోగా, వీరు మాత్రం ససేమిరా లొంగిపోయేది లేదంటూ చిన్న చిన్న బృందాలుగా సంచరిస్తున్నారు. వీరిలో దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు, స్థానిక భూమి పుత్తుడు పాపారావు ఒకడు. డీకేలో మిగిలివున్న ఈ ఏకైక రాష్ట్ర కమిటీ సభ్యుని ఆధ్వర్యంలోనే పై నాలుగు ఏరియా కమిటీలు పని చేస్తున్నట్లు సమాచారం. పాపారావుకు బాగా పట్టున్న జేగురుగొండ, పామేడు, ఇంద్రావతి నేషనల్ పార్క్ ప్రాంతాల్లోనే కార్యకలాపాలు కొనసాగుతుండడం గమనార్హం.
ఈ నేపథ్యంలోనే భద్రతా బలగాలు ఆపరేషన్ ఫోర్ను ప్రారంభించాయి. ఈ నెల 31లోగా మావోయిస్టు ముక్త్ భారత్ను సాకారం చేసే దిశలో భాగంగా కేంద్ర హోం శాఖ ఇచ్చిన స్పష్టమైన ఆదేశాలతోనే ఈ చర్య కొనసాగుతోందని తెలుస్తోంది. ఇప్పటికే కావాల్సినంత సమయం ఇచ్చామని, ఇక సహించేది లేదని, దాడి చేసి అంతమొందించండని ఆదేశాలు అందినట్టు సమాచారం. సీఆర్పీఎఫ్ కోబ్రా బలగాలు, కమాండో ఫోర్స్తో పాటు డీఆర్జీ కూడా ఇందులో పాల్గొంటున్నదని అంటున్నారు. పామేడు, జేగురుగొండ, నేషనల్ పార్క్, మాడ్ సరిహద్దు ఏరియాల్లోని పాత నక్సల్ స్థావరాలన్నింటిని చుట్టుముట్టి గాలింపు చేస్తున్నారని అక్కడి మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. ఇన్ఫార్మర్ల సాయంతో మావోయిస్టుల ఆనుపానులను తెలుసుకుంటున్నారని చెబుతున్నారు. ఏ క్షణమైనా ఎన్ కౌంటర్ జరగవచ్చనే పరిస్థితి ఉందని అంటున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు