
న్యూఢిల్లీ, 21 మార్చి (హి.స.)
ప్రపంచ ఇంధన మార్కెట్లో
పెరుగుతున్న ధరలను అదుపు చేసేందుకు అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్తో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో సముద్ర మార్గాల్లో నిలిచిపోయిన ఇరాన్ ముడి చమురు విక్రయాలపై ఉన్న ఆంక్షలను తాత్కాలికంగా సడలిస్తున్నట్లు అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ ప్రకటించారు. సముద్రంలో నౌకల్లో నిలిచిపోయిన ఇరాన్ ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తుల విక్రయానికి ఏప్రిల్ 19 వరకు గడువు ఇస్తూ ప్రత్యేక అనుమతులు జారీ చేశారు. తాజా నిర్ణయంతో సుమారు 140 మిలియన్ బారెల్స్ చమురు ప్రపంచ మార్కెట్లోకి అందుబాటులోకి వస్తుందని, తద్వారా ధరలు తగ్గే అవకాశం ఉందని అమెరికా భావిస్తోంది.
ఇప్పటి వరకు ఇరాన్ నుంచి తక్కువ ధరకే చమురు కొనుగోలు చేస్తున్న చైనాకు అడ్డుకట్ట వేసి, ఆ సరఫరాను భారత్, జపాన్, మలేషియా వంటి దేశాలకు మళ్లించడం ఈ నిర్ణయం వెనుక ఉన్న మరో వ్యూహంగా కనిపిస్తోంది. అయితే, అమెరికా తీసుకున్న ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఓ వైపు ఇరాన్తో యుద్ధం చేస్తూనే, మరోవైపు ఆ దేశ చమురు విక్రయాలకు అనుమతి ఇవ్వడం వల్ల వచ్చే ఆదాయం తిరిగి ఇరాన్ సైనిక అవసరాలకే ఉపయోగపడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కాగా, ఫిబ్రవరి చివరలో యుద్ధం మొదలైనప్పటి నుంచి 'స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్' (Strait of Hormuz) ద్వారా జరగాల్సిన చమురు రవాణా నిలిచిపోయింది. దీంతో ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 10 శాతం మేర కొరత ఏర్పడింది. గత వారం రష్యా చమురుపై కూడా ఇలాంటి సడలింపులే ఇచ్చిన అమెరికా, ఇప్పుడు ఇరాన్ విషయంలోనూ అదే బాటలో పయనిస్తుండటం అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..