
డిల్లీ, 21 మార్చి (హి.స.)నిందితుల వీడియోలు, ఫొటోలను పోలీసులు సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసి, ప్రజల ఆలోచనలను ప్రభావితం చేస్తున్నారని ఆరోపిస్తూ సుప్రీంకోర్టులో ఒక వ్యాజ్యం దాఖలైంది. ఒక కేసు విషయంలో పోలీసుల మీడియా బ్రీఫింగ్‌పై మార్గదర్శకాలు రూపొందించాలని అత్యున్నత న్యాయస్థానం ఇప్పటికే రాష్ట్రాలను ఆదేశించింది. అందులో సోషల్ మీడియాను కూడా చేర్చాలని పిటిషన్ కోరారు.
ఈ పిల్‌పై జరిగిన విచారణలో భాగంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సంకెళ్లు వేసిన, తాళ్లతో బంధించిన, మోకాళ్లపై కూర్చోబెట్టిన నిందితుల ఫొటోలను పోలీసులు సోషల్ మీడియాలో షేర్ చేయడం ఆ వ్యక్తి గౌరవానికి భంగం కలిగించడమే అవుతుందని, అది ప్రజల ఆలోచనను ప్రభావితం చేస్తుందని పేర్కొంది. ‘‘నిబంధనల ద్వారా పోలీసులను నియంత్రించడానికి వీలు ఉంటుంది. కానీ సోషల్ మీడియా, ప్రజల సంగతేంటి..? వారిని నియంత్రించగలమా..?’’ అని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ అంశంపై విస్తృత పరిశీలన అవసరం అని అభిప్రాయపడింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు