
హైదరాబాద్, 21 మార్చి (హి.స.) ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు
నెట్వర్క్ పరిధిని (Network Coverage) మరింత విస్తరించుకోవాలనే లక్ష్యంతో వోడాఫోన్ ఐడియా ప్రభుత్వ రంగ సంస్థ BSNL చేతులు కలుపబోతోంది. ఈ రెండు సంస్థలు తమ వద్ద ఉన్న టెలికాం టవర్లు (Towers), ఆప్టికల్ ఫైబర్ స్పెక్ట్రమ్ (Spectrum) వంటి వనరులను ఒకరికొకరు పంచుకోవడంపై చర్చలు ప్రారంభించాయి. మౌలిక సదుపాయాలను పంచుకోవడం వల్ల నెట్వర్క్ నిర్వహణ వ్యయం (Operational Costs) గణనీయంగా తగ్గుతుందని, ఇది ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రెండు సంస్థలకు ఎంతో ఊరటనిస్తుందని నిపుణులు భావిస్తున్నారు.
ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో BSNL నెట్వర్క్ బలంగా ఉండగా.. పట్టణ ప్రాంతాల్లో వొడాఫోన్ ఐడియా మౌలిక సదుపాయాలు మెరుగ్గా ఉన్నాయి. ఈ ఒప్పందం కుదిరితే రెండు సంస్థల వినియోగదారులకు మెరుగైన సిగ్నల్, డేటా సేవలు అందుతాయి. జియో, ఎయిర్టెల్ వంటి దిగ్గజ సంస్థలతో పోటీ పడటానికి ఈ సహకారం అత్యంత కీలకం కానుంది. అయితే, ఈ ఒప్పందంపై తుది నిర్ణయం పూర్తిగా వాణిజ్యపరమైన అంశాలపై ఆధారపడి ఉంటుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా వోడాఫోన్ ఐడియా సుమారు 20.5 కోట్ల మేర వినియోగదారులను కలిగి ఉంది. దేశంలో అతిపెద్ద ప్రైవేట్ టెలికాం ఆపరేటర్గా కొనసాగుతోంది. ఇందులో యాక్టివ్ కస్టమర్లు 19.3 కోట్లుగా ఉంగా.. మార్కెట్ వాటా 17.5 శాతం నుంచి 18 శాతం ఉంది. గత కొన్ని ఏళ్లుగా జియో, ఎయిర్టెల్ (Airtel) నుంచి ఎదురవుతున్న తీవ్ర పోటీ వల్ల
వోడాఫోన్ ఐడియా ప్రతి నెలా సగటున 10 లక్షల నుంచి 20 లక్షల వరకు వినియోగదారులను కోల్పోతూ వస్తోంది. వోడాఫోన్ ఐడియా వినియోగదారులలో మెజారిటీ భాగం ఇంకా 4జీ నెట్వర్క్లోనే ఉన్నారు. ఇటీవల నిధుల సేకరణ తర్వాత 5G సేవలను విస్తరించడం వినియోగదారులను ద్వారా నిలుపుకోవాలని సంస్థ ప్రయత్నిస్తోంది.
ఇక ప్రభుత్వ రంగ సంస్థ అయిన BSNLకు సుమారు 9.5 కోట్లు మంది వినియోగదారులు ఉండగా, మార్కెట్ వాటా 8 శాతం నుంచి 8.5 శాతంగా ఉంది. వైర్డ్ బ్రాడ్బ్యాండ్ కస్టమర్లు 40 లక్షలకు పైగా ఉండటం విశేషం.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..