
హైదరాబాద్, 21 మార్చి (హి.స.)
ప్రధాని నరేంద్ర మోడీ (PM
Narendra Modi) త్వరలో తెలంగాణలో పర్యటించనున్నారనే వార్త రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఏప్రిల్ రెండో వారంలో పీఎం టూర్ షెడ్యూల్ కాబోతున్నట్లు తెలుస్తోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పీఎం అక్కడ ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణలో కూడా పర్యటించేలా తెలంగాణ బీజేపీ నేతలు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పర్యటనలో భాగంగా బీబీనగర్ ఎయిమ్స్ ప్రారంభోత్సవం సహా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. అలాగే రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలే ప్రధాన ఎజెండాగా భారీ బహిరంగ సభ లేదా పార్టీ నేతలతో సమావేశం ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
మోడీ టూర్ విషయంలో ఇప్పటికే రాష్ట్ర నేతలకు సంకేతాలు అందాయని ఇందులో భాగంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇవాళ లేదా అతి త్వరలో పార్టీ నేతలతో అంతర్గత సమావేశం ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తోంది. మోడీ టూర్ ఎజెండాపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో బలపడాలని చూస్తున్న భారతీయ జనతా పార్టీకి (BJP) ఈ పర్యటన ఒక బూస్ట్ ఇవ్వబోతోందనే చర్చ జరుగుతోంది. మోడీ రాకతో తెలంగాణ బీజేపీలో కొత్త జోష్ పెరిగే అవకాశం ఉంది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ గతంతో పోలిస్తే మెరుగుపడింది. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం ఇప్పటికే పార్టీ నేతలు కసరత్తు మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో మోడీ టూర్ (PM Telangana Toure) తెలంగాణ కమలం పార్టీలో కొత్త ఉత్సాహం నింపనుంది.అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటిన బీజేపీ ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ మెజార్టీ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉన్నా నేతల మధ్య అంతర్గత విభేదాల కారణంగా ఆశించిన ఫలితాలు దక్కలేదనే టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా కీలక నేతల మధ్య ఆధిపత్య పోరు పార్టీని భారీగా డ్యామేజ్ చేస్తోందనే విమర్శలు ఉన్నాయి. వీటిని చెక్ పెట్టడంలో రాష్ట్ర నాయకత్వం విఫలమవుతోందనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో గతంలో జరిగిన సమావేశంలో తీరు మార్చుకోవాలని రాష్ట్ర నేతలను మోడీ హెచ్చరించారనే వార్తలు వచ్చాయి. అయినా అదే తంతు కొనసాగుతోందని ఇదే జరిగితే రాష్ట్రంలో బీజేపీకి ఉన్న అవకాశాలు దూరమవడం ఖాయం అనే అభిప్రాయాలు చేజేతులా దూరం చేసుకోవడమే తప్ప మరేమి కాదనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి రాబోతున్న మోడీ నేతల మధ్య విభేదాలకు చెక్ పెట్టి టీ బీజేపీని తిరిగి ట్రాక్ లోకి తీసుకురాబోతున్నారా? ఈ క్రమంలో మోడీ ఎలాంటి స్ట్రాటజీని ఉపయోగించబోతున్నారు అనేది ఉత్కంఠగా మారింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు