
హైదరాబాద్, 24 మార్చి (హి.స.)
రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులకు
ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఇవాళ బీజేపీ మరోసారి అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చింది. ఈ క్రమంలో నగరంలో బషీర్భాగాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ నేతృత్వంలో పెద్ద సంఖ్యలో దివ్యాంగులు ఈ నిరసనలో పాల్గొన్నారు. బషీర్బాగ్ ఫ్లైఓవర్ నుంచి అసెంబ్లీ వైపు కాలినడకన బయలుదేరారు.
ఎన్నికల సమయంలో దివ్యాంగులకు ఇచ్చిన పెన్షన్ పెంపు, ఇతర సంక్షేమ పథకాల హామీలను ప్రభుత్వం విస్మరించిందని పాయల్ శంకర్ ధ్వజమెత్తారు. తక్షణమే అర్హులైన వారందరికీ పెంచిన పెన్షన్లు అందజేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ పరిసరాల్లో భారీగా మోహరించిన పోలీసులు నిరసనకారులను బషీర్ బాగ్ వద్దే అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, బీజేపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. నిరసనకారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని సమీప పోలీస్ స్టేషన్లకు తరలించారు. దివ్యాంగుల హక్కుల కోసం తమ పోరాటం ఆగదని, ప్రభుత్వం దిగివచ్చేవరకు ఆందోళనలు కొనసాగిస్తామని పాయల్ శంకర్ వార్నింగ్ ఇచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు