
హైదరాబాద్, 26 మార్చి (హి.స.)
శ్రీరామనవమి శోభాయాత్రను
పురస్కరించుకుని ట్రాఫిక్ పోలీసులు భారీ ఆంక్షలు విధించారు. సీతారాంబాగ్ ఆలయం నుంచి సుల్తాన్ బజార్లోని హనుమాన్ వ్యాయామశాల వరకు సాగే ఈ శోభా యాత్ర దృష్ట్యా, వాహనదారులకు ఇబ్బంది కలగకుండా రేపు(శుక్రవారం) ఉదయం 9:00 గంటల నుంచి రాత్రి 9:00 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపు అమలులో ఉంటాయని జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్(ట్రాఫిక్) ఒక ప్రకటనలో తెలిపారు.
శోభాయాత్ర సాగే మార్గాల్లోని ప్రధాన జంక్షన్లు ఆసిఫ్ నగర్ నుంచి వచ్చే వాహనాలను మల్లేపల్లి ఎక్స్ రోడ్స్ వద్ద విజయ్ నగర్ కాలనీ నాంపల్లి వైపు, దారుసలాం నుంచి వచ్చే ట్రాఫిక్ను ఆఘాపురా ఎక్స్ రోడ్స్ వద్ద నాంపల్లి వైపు, పురానాపూల్ గాంధీ విగ్రహం నుండి వచ్చే వాహనాలను పురానాపూల్ దర్వాజా కర్వాన్ వైపు, ఎం జే మార్కెట్ బ్రిడ్జి నుంచి వచ్చే ట్రాఫిక్ జుమేరాత్ బజార్ మీదుగా, బేగం బజార్, మాలకుంట నుంచి వచ్చే వాహనాలను అలాస్కా టీ జంక్షన్ దారుసలాం వైపు, నాంపల్లి, అబిడ్స్ నుంచి వచ్చే వాహనాలను జాంబాగ్ పుత్లీబౌలి వైపు, అబిడ్స్ కోటి ఆంధ్ర బ్యాంక్ వైపు వచ్చే ట్రాఫిక్ను అబిడ్స్ జీపీఓ వద్ద ఎంజే మార్కెట్ వైపు చాదర్ ఘాట్ నుండి వచ్చే వాహనాలను నింబోలిఅడ్డ మరియు కాచిగూడ వైపు, రాంకోఠి నుంచి వచ్చే వాహనాలను బొగ్గులకుంట ఎక్స్ రోడ్ వద్ద మళ్లిస్తారు. రద్దీ శోభాయాత్ర కారణంగా బేగంబజార్, అఫ్ఘల్గంజ్, సిబిఎస్, కోఠి ఆంధ్ర బ్యాంక్, అబిడ్స్, ఎంజే మార్కెట్, చాదర్ ఘాట్,కాచిగూడ ప్రాంతాల్లో వాహన ఎక్కువగా ఉండే అవకాశం ఉండడంతో వాహనదారులు ఈ ట్రాఫిక్ ఆంక్షలను గమనించి, తమ ప్రయాణాలను తదనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని పోలీసులు కోరారు. అత్యవసర సహాయం కోసం ట్రాఫిక్ హెల్ప్న్ 9010203626 నంబర్ను సంప్రదించవచ్చని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..