చదువుతోనే కుటుంబాల అభివృద్ధి.. మంత్రి కోమటిరెడ్డి
నల్గొండ, 26 మార్చి (హి.స.) నల్గొండ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే నంబర్ వన్గా తీర్చిదిద్దుతానని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. చదువు ద్వారానే కుటుంబాలు బాగుపడతాయ
మంత్రి కోమటిరెడ్డి


నల్గొండ, 26 మార్చి (హి.స.) నల్గొండ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే నంబర్ వన్గా తీర్చిదిద్దుతానని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. చదువు ద్వారానే కుటుంబాలు బాగుపడతాయని, ప్రతి ఒక్కరూ తమ పిల్లలను తప్పనిసరిగా చదివించాలని ఆయన పిలుపునిచ్చారు. గురువారం నల్గొండ జిల్లా కనగల్ మండల కేంద్రంలో రూ.6 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల భవన నిర్మాణానికి మంత్రి భూమి పూజ నిర్వహించారు. అనంతరం కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో రూ.200 కోట్లతో ఆధునిక సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు నిర్మిస్తున్నామని చెప్పారు. కనగల్లో నిర్మిస్తున్న జూనియర్ కళాశాల చుట్టుపక్కల గ్రామాల విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం అందించనున్నట్లు మంత్రి తెలిపారు. నల్గొండలో రూ.150 కోట్లతో ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణం పూర్తయ్యిందని, నర్సింగ్ కళాశాల డిసెంబర్ లోపు పూర్తి చేస్తామని చెప్పారు.యువతకు ఉపాధి కల్పించేందుకు రూ.20 కోట్లతో న్యాక్ బిల్డింగ్ నిర్మాణం జరుగుతుందని, మహిళలకు సెట్విన్ ద్వారా శిక్షణ కార్యక్రమాలు అందిస్తున్నట్లు వివరించారు. మహిళల సాధికారత కోసం స్వయం సహాయక సంఘాలకు రుణాలు మంజూరు చేయడమే కాకుండా, నల్గొండలో రూ.5 కోట్లతో మహిళల పెట్రోల్ బంక్, సూపర్ మార్కెట్, రెస్టారెంట్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు ద్వారా మహిళలు ఆదాయం పొందవచ్చని సూచించారు. రోడ్ల అభివృద్ధిలో భాగంగా నల్గొండ నుంచి ధర్వేశిపురం వరకు రూ.50 కోట్లతో డబుల్ రోడ్, గుర్రంపోడు వరకు రూ.180 కోట్లతో రహదారి పనులు త్వరలో ప్రారంభమవుతాయని చెప్పారు. కనగల్ ప్రాంతంలో పలు రహదారి పనులకు కూడా నిధులు మంజూరు చేసినట్లు వెల్లడించారు.

పేదల సంక్షేమం కోసం రేషన్ కార్డులు, సన్న బియ్యం పంపిణీ, రూ.5 లక్షలతో ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం కొనసాగుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. కనగల్ అభివృద్ధికి పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. అంతకుముందు మంత్రి ధర్వేశిపురంలోని రేణుక ఎల్లమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆలయ అభివృద్ధి పై అధికారులకు సూచనలు చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande