
హైదరాబాద్, 24 మార్చి (హి.స.) పశ్చిమాసియా (ఇరాన్-ఇజ్రాయెల్)
యుద్ధం ఉద్రిక్తతల నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో ఇంధన, గ్యాస్ కొరత (Shortage of fuel and gas) ఏర్పడింది. ముఖ్యంగా అనేక పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు (No stock boards) పెడుతున్నారని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వార్తలపై నగర సీపీ సజ్జనార్ (CP Sajjanar) ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. హైదరాబాద్లో ఇంధన, గ్యాస్ కొరత లేదు.. పుకార్లను నమ్మవద్దని స్పష్టం చేశారు. ఆయన తన ట్వీట్లో హైదరాబాద్ నగరంలో పెట్రోల్, డీజిల్ మరియు ఎల్పీజీ సిలిండర్ల కొరత ఉందని వస్తున్న వార్తలను నగర పోలీసులు కొట్టిపారేశారు. నగరవ్యాప్తంగా తగినంత నిల్వలు అందుబాటులో ఉన్నాయని, సరఫరా ఎక్కడ ఆగిపోలేదని స్పష్టం చేశారు.
పశ్చిమాసియా (ఇరాన్-ఇజ్రాయెల్) యుద్ధ ఉద్రిక్తతల (Fuel supply) నేపథ్యంలో ఇంధన సరఫరా నిలిచిపోతుందనే తప్పుడు ప్రచారంతో ప్రజలు ఒక్కసారిగా పెట్రోల్ బంకులకు క్యూ కట్టడం వల్ల అనవసరపు రద్దీ ఏర్పడుతోందని సీపీ పేర్కొన్నారు. ప్రజలు ఆందోళనతో ఇంధనాన్ని నిల్వ చేసుకోవద్దని, దీనివల్ల సాధారణ సరఫరా వ్యవస్థకు ఆటంకం కలుగుతుందని ఆయన విజ్ఞప్తి చేశారు. అలాగే నగరంలోని తాజా పరిస్థితిని హైదరాబాద్ సిటీ పోలీస్ యంత్రాంగం నిరంతరం పర్యవేక్షిస్తోందని, పౌరసరఫరాల శాఖతో సమన్వయం చేసుకుంటూ సరఫరా సజావుగా సాగేలా చర్యలు తీసుకుంటున్నామని సీపీ సజ్జనార్ తెలిపారు.
అలాగే ఇలాంటి పుకార్లను ఎవరైనా వ్యాప్తి చేసిన, కృత్రిమ కొరత (Artificial scarcity) సృష్టించినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని నగర సీపీ సజ్జనార్ హెచ్చరించారు. ప్రజలు సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలను నమ్మవద్దని, శాంతియుతంగా ఉంటూ అధికారులకు సహకరించాలని వారు కోరారు. హోటళ్లు, రెస్టారెంట్ల కోసం వాడే కమర్షియల్ గ్యాస్ సరఫరాపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, గృహ వినియోగదారులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారని ఈ సందర్భంగా సజ్జనార్ తన ట్వీట్ ద్వారా చెప్పుకొచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు