
హైదరాబాద్, 24 మార్చి (హి.స.)
ఐపీఎల్ ఫ్రాంచైజీ 'రాజస్థాన్ రాయల్స్' రికార్డు ధరకు అమ్ముడుపోయింది. అమెరికాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కల్ సొమానీ నేతృత్వంలోని కన్సార్టియం సుమారు 1.63 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ.15,300 కోట్లు) ఈ జట్టును కొనుగోలు చేసినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. కల్ సొమానీ కన్సార్టియానికి వాల్మార్ట్ కుటుంబానికి చెందిన 'రాబ్ వాల్టన్', అలాగే 'హాంప్' కుటుంబం ఆర్థిక దన్నుగా నిలిచాయి. ఈ డబ్బు మొత్తాన్ని వారు ఒకేసారి (upfront) చెల్లించనున్నట్లు తెలిసింది. రాబోయే ఐపీఎల్ 2026 సీజన్ ముగిసిన తర్వాత ఈ కొనుగోలు ఒప్పందం అధికారికంగా అమల్లోకి రానున్నట్లు సమాచారం.
ఇప్పటివరకు మనోజ్ బదాలేకు చెందిన 'ఎమర్జింగ్' మీడియా వెంచర్స్' చేతిలో రాయల్స్ మెజారిటీ (65 శాతం) వాటా ఉంది. తాజా విక్రయంతో అది చేతులు మారనుంది. ఇక, ఐపీఎల్ చరిత్రలో ఇదే అతిపెద్ద డీల్ అని నిపుణులు చెబుతున్నారు. గత ఏడాది గుజరాత్ టైటాన్స్లో 67 శాతం వాటాను టొరెంట్ గ్రూప్ రూ. 5,025 కోట్లకు కొనుగోలు చేయగా, దాన్ని దాటేస్తూ రాయల్స్ ఏకంగా రూ.15 వేల కోట్లకు పైగా పలకడం గమనార్హం. ఆదిత్య బిర్లా గ్రూప్ (డేవిడ్ బ్లిట్జర్తో కలిసి), ఆర్సెలర్ మిట్టల్ వంటి బడా సంస్థలు ఈ ఫ్రాంచైజీ కోసం పోటీ పడినప్పటికీ అంతిమంగా సొమానీ కన్సార్టియం దక్కించుకుందని తెలిసింది.అమెరికాలోని అరిజోనాకు చెందిన కల్ సొమానీ.. ఎడెక్, డేటా ప్రైవసీ, ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) తదితర రంగాల్లో 15 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న ఎంట్రప్రెన్యూర్. ఇంట్రాఎడ్జ్ (IntraEdge), ట్రుయో (Truyo) వంటి సంస్థలకు ఆయన ఫౌండర్. క్రీడా రంగంలోనూ ఆయనకు పెట్టుబడులు ఉన్నాయి. కాగా, 2021లోనే రాజస్థాన్ రాయల్స్లో ఆయన కొంతమేర పెట్టుబడులు పెట్టడం విశేషం.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు