
భూపాలపల్లి, 24 మార్చి (హి.స.)
ఈ నెల 28వ తేదీన నిర్వహించబడనున్న జాతీయ మెగా లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఒక ప్రకటనలో సూచించారు. ఈ నెల 28వ తేదీ శనివారం నిర్వహించబడే జాతీయ లోక్ అదాలత్లో రాజీ పడదగిన కేసులను పరస్పర సమ్మతితో త్వరితగతిన పరిష్కరించుకునే అవకాశం ఉందని తెలిపారు. ముఖ్యంగా లోక్ అదాలత్లో క్రిమినల్ కంపౌండబుల్ కేసులు, సివిల్ వివాదాలు, ఆస్తి విభజన కేసులు, కుటుంబ మరియు వైవాహిక సంబంధిత కేసులు, బ్యాంకు రికవరీ కేసులు, విద్యుత్ చౌర్యం కేసులు, చెక్ బౌన్స్ కేసులు వంటి కేసులను పరిష్కరించుకోవచ్చని తెలిపారు.
శాఖ ఈ కేసుల్లో కక్షిదారులు రాజీ మార్గాన్ని ఎంచుకోవడం ద్వారా తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో పరిష్కారం పొందవచ్చని అన్నారు. చిన్న చిన్న వివాదాల కోసం కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయం, డబ్బు వృధా చేసుకోవడం కంటే రాజీ ద్వారా పరిష్కారం ఉత్తమమని సూచించారు. జ్యుడీషియల్ అందిస్తున్న ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని కోరారు. జిల్లాలోని పోలీస్ అధికారులు, కోర్టు సిబ్బంది రాజీ పడదగిన కేసులను గుర్తించి, ఇరువర్గాలకు కౌన్సిలింగ్ ద్వారా అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. కాబట్టి తమ కేసులను రాజీ ద్వారా పరిష్కరించుకోవాలనుకునే వారు సమీప పోలీస్ అధికారులను సంప్రదించాలని, లోక్ అదాలత్ ద్వారా బాధితులకు తక్షణ న్యాయం లభిస్తుందని ఎస్పీ తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు