
హైదరాబాద్, 24 మార్చి (హి.స.)
తెలంగాణ అసెంబ్లీ వేదికగా మంగళవారం ఒక అనూహ్య దృశ్యం ఆవిష్కృతమైంది.
అధికార, ప్రతిపక్ష నేతలు ఒకే చోట చేరి సుదీర్ఘంగా చర్చలు జరపడం రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారింది. అసెంబ్లీ డైనింగ్ హాల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మరియు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఒకే టేబుల్పై కూర్చుని లంచ్ చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. సాధారణంగా ప్రజాప్రతినిధులు డైనింగ్ హాల్లో కలిసి భోజనం చేయడం సహజమే అయినప్పటికీ, ఈ ముగ్గురు నేతల భేటీ మాత్రం ప్రత్యేకత సంతరించుకుంది. లంచ్ పూర్తయిన తర్వాత కూడా వారు అక్కడే ఉండి దాదాపు రెండు గంటల పాటు ఏకాంతంగా చర్చలు జరపడం ఆసక్తి రేకెత్తించింది. కేటీఆర్, రాజగోపాల్ రెడ్డిలు చాలా ఉత్సాహంగా, గంభీరమైన అంశాలపై మాట్లాడుకోవడం కనిపించింది.
గత కొంతకాలంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై రాజగోపాల్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారనే వార్తలు రాజకీయ వర్గాల్లో గుప్పుమంటున్నాయి. ముఖ్యంగా మంత్రి పదవి ఆశించినా దక్కకపోవడం, సొంత ప్రభుత్వంపైనే బహిరంగంగా విమర్శలు చేయడం, నియోజకవర్గ నిధుల విషయంలో వివక్ష జరుగుతోందన్న ఆవేదన చెందడం చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో, ప్రధాన ప్రతిపక్ష నేత కేటీఆర్తో ఆయన సుదీర్ఘంగా భేటీ కావడం తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త సమీకరణాలకు తెరలేపుతుందా? అనే చర్చ మొదలైంది. కేవలం కేటీఆర్, రాజగోపాల్ రెడ్డి మాత్రమే కాకుండా బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కూడా ఈ భేటీలో ఉండటం గమనార్హం. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ.. ఇలా మూడు ప్రధాన పార్టీల నేతలు రెండు గంటల పాటు ఏం చర్చించి ఉంటారనేది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఇది కేవలం మర్యాదపూర్వక భేటీనా? లేక భవిష్యత్ రాజకీయ మార్పులకు సంకేతమా? అని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు