
మెదక్, 24 మార్చి (హి.స.)
క్షయ వ్యాధి (టీబీ) నివారణ పైన
అవగాహన కార్యక్రమాలను చేపట్టాలని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. మంగళవారం స్థానిక ప్రభుత్వ హాస్పిటల్ లో ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం సందర్భంగా టీబీ ముక్త్ భారత్ అభియాన్ 2.0 అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు, జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు మాట్లాడుతూ.. క్షయవ్యాధి (టీబీ) నియంత్రణలో ముందస్తు గుర్తింపు, స్క్రీనింగ్, ప్రజల్లో అవగాహన పెంపు పై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. మొదటగా అధిక జనాభా గల ప్రాంతంలో ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. లక్షణాలు ఉన్న వారిని వెంటనే గుర్తించి నాట్, మైక్రోస్కోపీ, ఎక్స్-రే ద్వారా నిర్ధారణకు పంపాలని అధికారులకు సూచించారు. డయాబెటిస్, పోషకాహార లోపం, వృద్ధులు ఇతర సహ వ్యాధులు ఉన్నవారిని ప్రాధాన్యంగా స్క్రీనింగ్ చేయాలని, అన్ని కేసులను నిక్ష్య పోర్టల్ లో నమోదు చేయాలన్నారు.
జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ.. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని, అన్ని శాఖల మధ్య సమన్వయం పెంచి ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని, గుర్తించిన రోగులకు తక్షణ చికిత్స అందించాలన్నారు. టీబీ నివారణకు ముందస్తు గుర్తింపు, వ్యక్తిగత పరిశుభ్రత, బిసిజి టీకా టీబీ లక్షణాలపై ప్రజల్లో అవగాహన పెంపు చేయాలని సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు