
హైదరాబాద్, 24 మార్చి (హి.స.)తెలుగు రాష్ట్రాల్లోని పీజీ వైద్య విద్యార్థులకు, ముఖ్యంగా మేనేజ్మెంట్ కోటా సీట్ల కోసం ఎదురుచూస్తున్న వారికి సుప్రీంకోర్టు తీర్పు పెద్ద షాక్గా మారింది. పీజీ వైద్య సీట్ల భర్తీకి సంబంధించి కౌన్సెలింగ్ గడువును పొడిగించే ప్రసక్తే లేదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. తెలుగు రాష్ట్రాల్లో మిగిలిపోయిన పీజీ వైద్య సీట్ల భర్తీ కోసం కౌన్సెలింగ్ గడువును పొడిగించాలని దాఖలైన పిటిషన్లను జస్టిస్ పీఎస్. నరసింహ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. నేషనల్ మెడికల్ కమిషన్ వాదనలతో ఏకీభవిస్తూ కోర్టు ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
ఇప్పటికే ఏడు రౌండ్ల కౌన్సెలింగ్ నిర్వహించామని, ఇంతకంటే ఎక్కువ రౌండ్లు నిర్వహించడం సాధ్యం కాదని న్యాయస్థానం తేల్చిచెప్పింది. కౌన్సెలింగ్ ప్రక్రియను నిరంతరాయంగా కొనసాగిస్తే విద్యా క్యాలెండర్ దెబ్బతింటుందని, ఇది వైద్య విద్య నాణ్యతపై ప్రభావం చూపుతుందని ధర్మాసనం అభిప్రాయపడింది. ప్రతి సంవత్సరం కొన్ని సీట్లు మిగిలిపోవడం సహజమేనని, ముఖ్యంగా ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో అధిక ఫీజుల కారణంగా సీట్లు మిగిలిపోతాయని న్యాయస్థానం వ్యాఖ్యానించింది.
ఈ కేసులో ఎన్ఎంసీ తన నివేదికను సమర్పిస్తూ కౌన్సెలింగ్ పొడిగింపును తీవ్రంగా వ్యతిరేకించింది. మిగిలిపోయిన సీట్లలో అత్యధికం ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు చెందినవేనని, ప్రభుత్వ సీట్లు దాదాపు భర్తీ అయ్యాయని వివరించింది. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పుల ప్రకారం, నిర్దేశించిన తేదీ దాటిన తర్వాత అడ్మిషన్లు చేపట్టడం నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేసింది. ఈ తీర్పుతో సీటు వస్తుందని ఆశపడిన వందలాది మంది విద్యార్థులు ఈ విద్యా సంవత్సరానికి అవకాశం కోల్పోయారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్